ముగిసిన ఎన్ఐఏ విచారణ.. జగన్ పై దాడికి కారణమదే!!

 

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ ముగిసింది. ఈనెల 12న నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఐ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. 12,13 తేదీల్లో అతన్ని విశాఖలో విచారించారు. తర్వాత హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకువచ్చారు. సోమవారం నుంచి న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రేపు ఉదయం విశాఖ కోర్టులో శ్రీనివాసరావును హజరుపరచనున్నారు. సంచలనం కోసమే జగన్‌పై దాడి చేశానని విచారణలో నిందితుడు చెప్పినట్లు సమాచారం.
 
డీఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ ఐదు రోజుల విచారణలో శ్రీనివాసరావు ఒక విషయం చెప్పాడు. కేవలం సంచలనం కోసమే జగన్‌పై దాడి చేశానని, తన వెనుక ఎవరూ లేరని, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పడంతో అధికారులు బుధవారం రాత్రితో విచారణ ముగించారు. 7 రోజులు కస్టడీకి తీసుకున్నప్పటికీ 5రోజులలో విచారణ ముగించారు.జగన్ పై దాడి కేసు రాజకీయ పరంగానూ కీలకంగా మారడంతో ఎన్ఐఏ అధికారులు నిర్వహిస్తున్న విచారణ మొత్తాన్ని ఆడియో రికార్డు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఒకరు, ముంబై నుంచి మరొకరు చొప్పున ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చారు.