బజారున పడ్డ భారతీయ పత్రికలు

 

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలలో మీడియా కూడా ఒకటని మాటమాటికీ వింటాం. కానీ ఆ మీడియా పరిస్థితిని చూస్తే మాత్రం చిరాకో, కోపమో కలగక మానదు. మొన్నటివరకూ మీడియా అంతా మోదీని ఆకాశానికి ఎత్తేసింది. ఆయన పాలనలో పొరపాట్లు జరుగుతున్నాయన్న విషయాన్ని చెప్పేందుకు ఏ ఒక్క ప్రముఖ పత్రికా సాహసించలేదు. ద వైర్‌, స్క్రోల్ వంటి ఒకటి రెండు వెబ్‌ పత్రికలు మాత్రమే కాస్త ధైర్యం చేయగలిగాయి. ఎప్పుడైతే మోదీ ప్రభ తగ్గి, ఆయన వల్ల తమకు పెద్దగా నష్టం జరగదనుకున్న నిర్ణయానికి వచ్చాయో... అప్పుడే ఎక్కడలేని ఉత్సాహంతో బీజేపీ పాలన మీద యుద్ధం ప్రకటించాయి. మోదీ మీద కార్టూన్లు, ఆయన మనస్తత్వం మీద ప్రత్యేక విశ్లేషణలు మొదలయ్యాయి. చాలా జాతీయ/ ప్రాంతీయ పత్రికల అవకాశవాదం ఎంత లోతుకి దిగజారిందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చెప్పుకొంటే సరిపోతుందేమో! కానీ తాము అంతకంటే హీనస్థాయిలో ఉన్నామని కొన్ని పత్రికలు కెమెరా సాక్ష్యంగా చెప్పుకొచ్చాయి. డబ్బులిస్తే మళ్లీ మోదీని ఆకాశంలో నిలబెడతామని అమ్ముడుపోయేందుకు సిద్ధపడ్డాయి.

కోబ్రాపోస్ట్‌ అనే పరిశోధనా పత్రిక ఆ మధ్య ‘ఆపరషన్‌ 136’ పేరుతో ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. భగవద్గీత, కృష్ణుని బోధల ముసుగులో హిందుత్వని ప్రచారం చేయాలని కొన్ని పత్రికలను సంప్రదించింది. ఇలా చేసినందుకు 500 కోట్ల వరకూ భారీ నగదుని ఎర చూపింది. ఈ ఆపరేషన్‌లో ఒకటి కాదు, రెండు కాదు- ఏకంగా 27 పత్రికల మీద ఉచ్చు బిగించారు. వాటిలో రెండు బెంగాలీ పత్రికలు మినహా, మిగతా పత్రికల ప్రతినిధులంతా తోలుబొమ్మల్లా ఆడేందుకు ఉత్సాహం చూపించారు.

ఈ ఆపరేషన్‌లో చిక్కుకున్న సంస్థలు సామాన్యమైనవి కావు. టైమ్స్ ఆఫ్‌ ఇండియా అధినేత వినీత్ జైన్‌ స్వయంగా కెమెరా ముందు ఫోజులిస్తూ దొరికిపోయాడు. ఇండియా టుడే వైస్‌ చైర్మెన్‌ ‘కాలీ పురి’ కూడా డబ్బు కోసం హిందుత్వ అజెండాకు సిద్ధపడింది. ఇక హిందుస్థాన్‌ టైమ్స్‌, దైనిక్‌ భాస్కర్, జీ న్యూస్‌, స్టార్ ఇండియా, రేడియో వన్, లోక్‌మత్‌, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్....తదితర పత్రికలూ ఈ జాబితాలో ఉన్నాయి.

కోబ్రాపాస్టు ఉచ్చులో రెండు తెలుగు మీడియా సంస్థలు (ఏబీఎన్, టీవీ5) కూడా ఉండటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. తాము తెలుగుదేశానికి సానుకూలం అని ఏబీఎన్ ప్రతినిధి హొయలు పోతే, మీరెలా కావాలంటే అలా చేసి పెడతామని టీవీ5 ఉద్యోగి దేబిరించాడు. అందుకేనేమో... కోబ్రాపోస్టు ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే తెలుగు మీడియా మాత్రం ఎక్కడా ఏమీ జరగనట్లు గుంభనంగా మిన్నకుండిపోయింది.

సహజంగానే కోబ్రాపోస్టు ఉచ్చులో చిక్కుకున్న పత్రికలన్నీ తమకేం తెలియదని భుజాలు తడుముకున్నాయి. కొన్ని పత్రికలైతే కోర్టు కేసులకి సిద్ధపడ్డాయి. కానీ కొన్నాళ్లుగా మీడియా తీరు గమనిస్తున్న ప్రజలు మాత్రం, వాటి నడవడిలో ఏదో లోపం ఉందని గాఢంగా విశ్వసిస్తున్నారు. అది తప్పనీ తాము నిప్పనీ నిరూపించుకునే బాధ్యత సదరు మీడియా మీద ఉంది. లేకపోతే మీడియా తీరు కూడా ‘నాన్నా పులి’ కథలో పిల్లవాడి అబద్ధపు బతుకులా మారిపోతుంది. కాకపోతే ఇందులో నష్టపోయేది మాత్రం ప్రజలే!