ఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీకి కొత్త అధ్యక్షుడు!!

 

తెలంగాణ టీడీపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలనుకుంటుంది. ఎన్నికలలోగా పార్టీని గాడిన పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి మార్పు సహా.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయానికి వచ్చిందట. 

రాష్ట్ర విభజన తరవాత రెండు రాష్ట్రాలకూ ఇద్దరు అధ్యక్షులను నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులయ్యారు. ఏపీలో టీడీపీ బలంగా ఉంది, అధికారంలో ఉంది.. కాబట్టి ఏ సమస్య లేదు. కానీ తెలంగాణ లో పరిస్థితి ఆలా లేదు. రోజురోజుకి పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది.  ఒక్కప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది.

విభజనంతరం 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని గెల్చుకుంది. అయితే 13మంది ఎమ్మేల్యేలు, ఒక ఎంపీ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా చూడటంలో అధ్యక్షుడిగా రమణ విఫలమయ్యారనే వివర్మలున్నాయి‌. గ్రేటర్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని గెల్చుకుంది. తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో సైతం అధ్యక్షుడిగా ఎల్‌.రమణ పనితీరుపై విమర్శలు వచ్చాయి.‌ ప్రజాకూటమిని ఏర్పాటు చేయటంలో రమణ చొరవ తీసుకున్నప్పటకీ.. పార్టీ క్యాడర్లో మాత్రం ఉత్సాహం నింపలేకపోయారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు టికెట్ల పంపిణీ విషయంలో కూడా రమణపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు‌. ముందస్తు ఎన్నికల్లో పోటీచేయకుండా.. రమణ సేఫ్ గేమ్ ఆడారనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుందట.

అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పిడి వల్ల పార్టీకి నష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారట. మరోవైపు ఒకవేళ అధ్యక్షుడిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది అంతుచిక్కడం లేదట. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన అధిష్టానం దగ్గర తన మనసులో మాటను చెప్పారట. అయితే పార్టీ అధినేత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. చూద్దాం మరి చంద్రబాబు రమణని మారుస్తారో లేదో.