మనకోసం మరో మూడు గ్రహాలు

భూమి ఓ అసాధారణమైన గ్రహం. అదృష్టమో, ప్రకృతి వరమో కానీ ఇక్కడ జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అనువైన ఉష్ణోగ్రతలు, సూర్యుడి నుంచి తగినంత దూరం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, నీటి సౌలభ్యం, రాతి నేల, గురుత్వాకర్షణ శక్తి, భూమి మీదకు ఉల్కలు దూసుకురాకుండా కాపాడే గురుగ్రహం.... ఇలా చెప్పుకొంటూపోతే అద్భుతం అనదగ్గ సానుకూలతలు ఎన్నో భూమికి సొంతం. అందుకనే భూమిలాగా జీవానికి సహకరించే ప్రాంతం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదని నమ్ముతుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడో శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ వంటి అతికొద్ది ఉపగ్రహాల మీద మాత్రమే జీవం మనుగడ సాగించే సావకాశం ఉందని భావిస్తుంటారు. మరి ఇప్పుడో...


భూమికి కేవలం 39 కాంతిసంవత్సరాల దూరంలో సౌరకుటుంబాన్ని పోలిన ఓ వ్యవస్థ ఉన్నట్లు నాసా ప్రకటించింది. ఏడాదిలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అది ఓ కాంతి సంవత్సరం అన్న విషయం తెలిసిందే! వినడానికి ఈ దూరం కాస్త ఎక్కువే అనిపించినా, ఈ అనంత విశ్వంలో ఇది ఇంచుమించు పక్కింటితో సమానం. కుంభరాశిలో భాగంగా ఉన్న ఈ వ్యవస్థలోని నక్షత్రానికి ట్రాపిస్ట్‌ 1 అని పేరు పెట్టారు. ఈ ట్రాపిస్ట్‌ 1 నక్షత్రం చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నట్లు గమనించారు. ఈ గ్రహాలన్నీ కూడా సదరు నక్షత్రానికి చాలా చేరువలో ఉన్నాయట. ఒక గ్రహం మీద నిలబడి చూస్తే మిగతా ఆరు గ్రహాలన్నీ కూడా కనిపించేంత దగ్గరదగ్గరగా ఇవి ఉన్నాయి.


సూర్యుడితో పోలిస్తే ఈ ట్రాపిస్ట్‌ నక్షత్రం దాదాపు పదోవంతు మాత్రమే ఉంటుంది. పైగా దీని నుంచి వచ్చే కాంతి మన సూర్యకాంతికంటే 200 రెట్లు తక్కువట. అయితే నక్షత్రానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల దీని చుట్టూ తిరిగే గ్రహాల మీద ఉష్ణోగ్రతలు 0- 100 మధ్యలోనే ఉంటాయని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా 4,5,6 గ్రహాలు జీవానికి మరింత అనువుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.


ట్రాపిస్ట్‌ 1 గురించి అందిన సమాచారమంతా వాటి మీద మనిషి మనుగడకి సంబంధించి కొత్త ఆశలను కల్పించేట్లుగానే ఉంది. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ గ్రహాల మీద నీటి లభ్యత ఎంత, వాటి మీద లభించే ఖనిజాల ఏమిటి... లాంటి పరిశోధనల ఇంకా జరగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వాటి మీద మనుషులు జీవించే అవకాశం ఉందో లేదో నిర్ధారించగలం. అసలు ఇప్పటికే వాటి మీద కొన్ని జీవులు బతికేస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. ఏది ఏమైనా ఇన్నాళ్లకి భూమిని పోలిన గ్రహాలు కొన్ని శాస్త్రవేత్తలకు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.

 

- నిర్జర.