బాలయ్య రాకతో ఖమ్మం టీడీపీ బలపడిందా?

ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పసుపు జెండా బాగానే రెపరెపలాడింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితి మారిపోయింది. ఏపీలో అయితే టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ తెలంగాణలో వెనుకబడిపోయింది. దాదాపు  ఆ పార్టీలోని బలమైన నేతలంతా పార్టీని వీడారు. దీంతో తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే ఇలాంటి బ్యాడ్ టైములో కూడా టీడీపీకి కలిసొచ్చే అంశం ఒకటుంది. తెలంగాణలో టీడీపీని ఎందరు వీడినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేడర్ టీడీపీనే అంటిపెట్టుకొని ఉంది. అలాంటి వాటిల్లో ఖమ్మం జిల్లా ఒక్కటి. పసుపు జెండా తప్ప వేరే జెండా పట్టుకోవడానికి మనసొప్పని కేడర్.. ఎప్పటికైనా టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం వస్తుందన్న ఆశతో, నమ్మకంతో.. నిరుత్సాహ పడకుండా ఎదురు చూసారు. వారి ఆశ ఆనందంగా, నమ్మకం నిజంగా మారడానికి.. మహాకూటమి, బాలకృష్ణ రూపంలో అదృష్టం వరించింది.

 

 


తెలంగాణ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్, టిజెఎస్, సిపిఐలతో కలిసి టీడీపీ మహాకూటమిలో భాగమైంది. ఈ మహాకూటమితోనే తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోలేదు, నాయకులు దూరమైనా పార్టీ బలంగానే ఉందనే విషయం స్పష్టమైంది. మహాకూటమితో తెలంగాణ టీడీపీలో ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఖమ్మంలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఖమ్మంలో మొదటి నుండి టీడీపీ బలంగా ఉంది. విభజన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు కొంత కేడర్ ని వెంటపెట్టుకొని పార్టీని వీడి తెరాసలో చేరినా.. మిగిలిన కేడర్ మాత్రం టీడీపీతోనే ఉంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర లాంటి నేతలు ఉన్నా.. ఈ నాలుగేళ్లు పరిస్థితుల వల్ల వారు కార్యకర్తలకు పూర్తీ భరోసా ఇవ్వలేకపోయారు. అయితే నాలుగేళ్ళ తరువాత వాళ్ళ ఎదురుచూపులు ఫలించాయి. మహాకూటమితో అటు నేతల్లో, ఇటు కార్యకర్తల్లో ఉత్సాహం మొదలైంది. అయితే ఈ ఉత్సాహం రెట్టింపు అయింది మాత్రం బాలయ్య పర్యటనతోనే అని చెప్పాలి.

 

 


నామా, సండ్ర ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటనకు శ్రీకారం చుట్టారు. అంచనాలకు మించి ఆ పర్యటన విజయం సాధించింది. మధిర, వైరా, సత్తుపల్లి నియోజక వర్గాల్లో పర్యటించిన బాలయ్య పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అదే విధంగా తన స్పీచ్ తో ఉత్సాహం నింపారు. కార్యకర్తలు కూడా బాలయ్యకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. మధిర నుండి సత్తుపల్లి వరకు కార్యకర్తలు, అభిమానులు స్వచ్చందంగా విశేష సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేసారు. పార్టీని వీడలేక పార్టీకి మంచిరోజులు ఎప్పుడు వస్తాయంటూ నాలుగేళ్లుగా లోలోపలే కుమిలిపోతూ ఎదురు చూస్తున్న కార్యకర్తలు బాలయ్య పర్యటనతో కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో పసుపు జెండాలు పట్టుకొని బాలయ్య వెంట నడిచారు. మనసు అంగీకరించకపోయినా వేరే పార్టీలలో చేరిన వారు కూడా బాలయ్య రాకతో ఇదే కదా మన అసలు పార్టీ అంటూ పసుపు జెండా పట్టుకున్నారు. దీంతో మొన్నటి వరకు అసలు పార్టీ ఉందా? అని వెటకారం చేసినవారే.. పార్టీ ఇంత బలంగా ఉందా!! అని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా బాలయ్య రాకతో ఖమ్మం టీడీపీ బలపడిందనే చెప్పాలి.