మొదటి రోజు పనిలో ఈ 5 విషయాలు చేయకండి....!

 

అది మనకి మొట్ట మొదటి ఉద్యోగమా లేక పదవదా అని సంబంధం లేకుండా, ఒక ఆఫీస్ లో మొదటి సారి కాలు పెట్టిన ప్రతి సారి కొంచెం ఒత్తిడికి గురవడం సర్వసాధారణమయిన విషయం. అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నామో కూడా తెలియదు, కానీ చేతులు వణకడం, గొంతు రాకపోవడం, ఇలాంటివి కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఇలాంటి సందర్భంలో కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే, మొదటి రోజు ఉద్యోగంలో ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చేయకుండా జాగ్రత్త వహించండి.

 

1 . అల్పాహారం దాటవేయడం:
ఒకవేళ మీకు ఉదయం టిఫిన్ చేసే అలవాటు లేకపోయినా, ఇంటిని వదిలే ముందు ఖచ్చితంగా తినేసే బయల్దేరండి, ఎందుకంటే ఆఫీస్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు ఖచ్చితంగా అవగాహన ఉండదు. క్యాంటీన్ కానీ కాఫీ షాప్ గాని ఆఫీస్ ప్రాంగణంలో దొరుకుతుందో లేదో... ఆఫీస్ లో పని ఎలా ఉంటుందో... విరామ సమయం ఎప్పుడో... ఈ విషయాలు తెలియదు కాబట్టి టిఫిన్ చేసి వెళ్లడమే ఉత్తమం.

 

2 . ఆలస్యం గా రావడం, త్వరగా వెళ్లిపోవడం:
ట్రాఫిక్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం మనకి విదితమే. కాబట్టి, ట్రాఫిక్ అనేది ఆలస్యానికి ఒక సాకుగా ఎప్పుడూ చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి, మరీ ముఖ్యంగా ఆఫీస్ కి వెళ్లే మొదటి రోజు. కొంచెం ముందుగా వెళ్లడం వల్ల మనకి పోయేది కూడా ఏం లేదు కదా. ఒక రకంగా పరిస్థితులు, వాతావరణం అలవాటు పడటానికి సమయం దొరుకుతుంది. ఇక ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే విషయంలో తొందరపడకండి. బాస్ దగ్గర చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.

 

3 . సెలవు తీసుకోవడం:
అది మీరు ఆఫీస్ కి వెళ్లే మొదటి రోజు కాబట్టి పొరపాటున కూడా సెలవు తీసుకునే కార్యక్రమాలు ఏం పెట్టుకోకండి. ఒక వేళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే, వేరే తేదీకి మార్చే ప్రయత్నం చేయండి. తప్పదు అనుకుంటే అదే రోజు ఆలస్యం గా వెళ్లే వెసులుబాటు చేసుకోండి. ఎందుకంటే, ఒక రోజు మొత్తం సెలవు తీసుకోవడం కన్నా, కొంచెం పని చేసి వెళితే మంచిది కదా.

 

4 . అసౌకర్యవంతమయిన దుస్తులు ధరించడం:
మొదటి రోజు ఆఫీస్ అనగానే సహోద్యోగులకి గొప్పగా కనిపించే ప్రయత్నంలో స్టైలిష్ దుస్తులు ధరిస్తాం. అయితే, వీలయినంత వరకు మెట్లు ఎక్కడం కానీ, ఆఫీస్ లో వేరే ఇతర ఏదయినా పనులకి విఘాతం కలిగించని మరియు మీకు సౌకర్యవంతమయిన బట్టలు వేసుకోండి. కొంచెం అలవాటు అయ్యేవరకు మనం రెగ్యులర్ గా వేసే దుస్తులు ధరిస్తేనే మంచిది.

 

5 . ఎక్కువగా ఫోన్ వినియోగించడం:
మీకు ఎంతయితే ఉత్సాహం ఉంటుందో, మీ కుటుంబ సభ్యులకి గాని సన్నిహితులకు గాని అంతకు మించిన అత్యుత్సాహం ఉంటుంది. మీరు ఆఫీస్ లో ఉన్న సమయంలోనే ఫోన్ చేసి ఎలా ఉంది అని ఒకరి తర్వాత ఒకరు అడిగే ప్రయత్నం చేస్తారు. కొందరు, వేరే విషయాలు ఆలోచించకుండా లేదా ఒత్తిడిని అధిగమించడానికి వచ్చిన అన్ని ఫోన్స్ మాట్లాడుతూ సమయం గడిపేస్తారు. అయితే, ఇలా చేస్తే మీ బాస్ కి మొదటి రోజే అడ్డంగా దొరికిపోతారు. వీలయినంత మటుకు ఫోన్ సైలెంట్ లో పెట్టి బ్రేక్ సమయంలో మాట్లాడండి.