తెలంగాణాకి కూడా కొత్త గవర్నర్ ?

 

రాష్ట్ర విభజన అనంతరం సుమారు ఐదేళ్ళ తర్వాత ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించారు. ఇక ఇప్పుడు తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను తెలంగాణకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2009 నుండి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ని కూడా ఏక్షణంలోనైనా మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నా గత ప్రభుత్వం ముందే రాజధానిని అమరావతికి తరలించింది నెమ్మదిగా హైకోర్టు విభజన కూడా పూర్తిచేశారు. 

మొన్న జగన్ చొరవతో ఆంధ్రా బిల్డింగ్స్ కూడా తెలంగాణకు ఇచ్చేయగా, సచివాలయంలో ఆంధ్రకు చెందిన బ్లాక్‌లను కూడా తెలంగాణకు కేటాయించారు. ఇక తాజాగా ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ కూడా పోయి.. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌లు వచ్చారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై చట్టంలో ప్రత్యేకంగా ‘సెక్షన్‌ 8’ను పొందుపరిచారు. సెక్షన్‌-1(7) లో ఉమ్మడి గవర్నర్‌ ప్రస్తావన ఉండగా ఆ తర్వాత సెక్షన్‌-1 (8)(1)లో రాజధానిలో గవర్నర్‌ అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. 

సెక్షన్‌-8లో ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం ప్రజల రక్షణ, ఆస్తులను కాపాడే అధికారం గవర్నర్‌కు అప్పగించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వ భవనాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం వంటి బాధ్యతలను గవర్నర్‌కు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ నియామకం నేపథ్యంలో నరసింహన్ పదవీకాలం కూడా ముగిసినట్లే అనే ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ళ క్రితం ఆయన గవర్నర్ గా తప్పుకుని కేంద్ర హోం శాఖకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఏమి జరగనుందో వేచి చూడాలి ?