నామినేటెడ్ పదవుల రచ్చ... నెల్లూరు జిల్లాలో నిరాశతో వైసీపీ కేడర్!

 

కష్టకాలంలో పార్టీ జెండా మోశారు. నాయకుడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పార్టీని మాత్రం వీడలేదు. వరుసగా రెండు ఎన్నికల్లో పట్టుదలగా పని చేశారు. అయితే ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత తమను పట్టించుకోవడం లేదని మదనపడుతోంది వైసిపి కేడర్. అధికారం వచ్చి ఆరు నెలలు అయినప్పటికీ నామినేటెడ్ పదవుల పంపిణీ జరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కడపతో సమానంగా అదే స్థాయిలో వైసీపీకి పట్టం గట్టిన జిల్లా నెల్లూరు. నాయకులు పార్టీలు మారినా క్యాడర్ మాత్రం జగన్ కే జై కొట్టింది. అత్యధిక మెజార్టీతో పార్టీ ప్రతి నిధులు గెలవడానికి పనిచేసారు కింది స్థాయితో పాటు నియోజక వర్గ స్థాయి నేతలు. పార్టీ గెలుపు కోసం అంతలా పనిచేసిన వారు ఇప్పుడు తమకు గుర్తింపు లభించడం లేదని వాపోతున్నారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద స్థాయిలో ప్రభుత్వాల్లో నామినేటెడ్ పదవుల పంపిణీ జరుగుతుందని భావించారు. ముందుగా జిల్లాలోని మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్లు, దేవాదాయ పాలక మండళ్లు, ఆసుపత్రి కమిటీలు, సాగు నీటి సంఘాలతో పాటు వివిధ పదవుల పంపిణీ జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. దీంతో పాటు నుడా చైర్మన్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్ లతో అధినాయకత్వానికి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఇప్పుడు ద్వితియ శ్రేణి నాయకత్వం డీలాపడుతోంది. సహకార సంఘాల్లో మాత్రం అధ్యక్షుల పోస్టులను నామినేటెడ్ తరహాలో భర్తీ చేశారు. గతంలో కూడా మెజారిటీ నాయకులు వైసీపీ వారే ఎలెక్ట్ కావడం వల్ల సహకార సంఘాల్లో కొనసాగుతున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు మిగతా నామినేటెడ్ పోస్టులను వేగంగా భర్తీ చేయాలని కేడర్ కోరుతుంది. 

ప్రతి సెగ్మెంట్ నుంచి పలువురు నేతలు కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా జగన్ మోహన్ రెడ్డిని చూసి తాము పని చేశామని.. అందుకైనా తమకు న్యాయం చేయాలని వారంతా కోరుకుంటున్నారు. అదే సమయంలో జిల్లాలో జరుగుతున్న గ్రూప్ పాలిటిక్స్ తో తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్న భయం వారిలో కనిపిస్తుంది. నియోజక వర్గాల వారీగా ఆశావహుల లిస్ట్ చూస్తే చాంతాడంత కనిపిస్తుంది. ఇందులో మెజారిటీ నాయకులు సొంత హవా వున్నవారు కావడంతో వీరి విషయంలో తేడా జరిగితే భవిష్యత్ లో పార్టీకి కూడా ఇబ్బందులొస్తాయని భావిస్తున్నారు. సామాజిక సమీకరణలకు అనుగుణంగా పదవుల కేటాయింపు కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో బలంగా పని చేశామని ఎన్నికల్లో పనిచేయటానికి లేని సామాజిక సమీకరణలు ఇప్పుడు అవసరమా అని కొందరు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. 

నియోజక వర్గాల వారీగా కావలిలో గంథం శ్రీనివాసలు, మన్నెమాల సుకుమార్ రెడ్డి, కుందిర్తి శ్రీనివాసులు, కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, కేతిరెడ్డి శివ కుమార్ రెడ్డి, తన్నీరు మాల్యాద్రి, బుర్కా శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలూ చేస్తున్నారు. గూడూరులో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడైన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోటకు చెందిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, అల్లంపాడు శ్యాంప్రసాదరెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పొనకా శివ కుమార్ రెడ్డి, కనుమూరి హరిశ్చంద్రారెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఆత్మకూరులో ఇరవై మంది వరకు రేసులో కనిపిస్తున్నారు. ఉదయగిరిలో కేవలం మార్కెటింగ్ కమిటీల మీదే ఆశలు పెట్టుకున్నారు నాయకులూ. అదలావుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆ తరువాతే పదవుల పందారం ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగే వారి వల్ల కొంత పోటీ తగ్గుతుందనీ ఆశావహులు ఆశిస్తున్నారు. అయితే అధికార పార్టీల్లో ఆశావహులందరినీ జిల్లాలోని గ్రూప్ పాలిటిక్స్ భయం వెంటాడుతూ ఉండటం గమనార్హం.