నెల్లూరు టిడిపిలో గందరగోళం.. వైసీపీ వైపు అడుగులు వేస్తున్న నేతలు

 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం వీచిన సమయంలో సైతం 10 నియోజకవర్గాల్లో 5 నియోజక వర్గాలను టిడిపి కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీకి 4 నియోజకవర్గాలే దక్కాయి. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లోనే 10 కి 10 స్థానాలను టిడిపి చేజార్చుకుంది. ప్రతికూల ఫలితాలు రావటానికి కారణాలను పార్టీ ముఖ్యనేతలు అభ్యర్ధులు శోధిస్తే అనేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొందరు నేతలు చేసిన తప్పిదాలు.. లోపాయికారి ఒప్పందాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై ఆ పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. ప్రస్తుతం టిడిపి నుంచి వలసలు సాగుతున్న నేపథ్యంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమావేశాలు నిర్వహించారు.

టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ టికెట్లను 33 శాతం యువతకు, 33 శాతం మహిళలకూ ఇవ్వనున్నారు. కార్పొరేషన్ లో డివిజన్లు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కమిటీ వేసేందుకు పేర్ల పరిశీలన కూడా కొనసాగుతోంది. అలాగే నెల్లూరు నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇటీవల పరిష్కారం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమస్య మీది పరిష్కారం కోసం పోరాటం మాది అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ప్రతి శనివారం ప్రజలు టిడిపి కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకోవడం సోమవారం అధికారులను కలిసి ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడటమే ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పరిష్కారం కార్యక్రమంలో అందిన సమస్యలను ఒకటికి రెండు సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వారు స్పందించకుంటే పోరాటమైనా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం గురించి జోరుగానే చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అనుకుంటున్నారు. మరోవైపు టిడిపి హయాంలో పదవులు అనుభవించిన చోటమోటా నేతలు కొందరు ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీతో ప్రయాణం ఎలా ఉందని ప్రశ్నిస్తే వారు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చకచకా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గానీ, ఆ తర్వాత తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేసి కార్యక్రమాలు చెప్పడం లేదని ఒకవేళ వాటికి వెళ్లిన వెనక సీట్లలోనే కూర్చోవల్సి వస్తుందని స్థానికంగానూ ఆ పార్టీలో ముందు నుంచి నాయకులతో విభేదాలు తలెత్తుతున్నాయని వారు బాధలను ఏకరువు పెడుతున్నారు. ఈ సంగతి తెలిసి టిడిపిలో పక్క చూపులు చూస్తున్న వారు అధికార పార్టీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిజానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో పార్టీలో చేరికలకు ప్రాధాన్యమిస్తూ వెళుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో టిడిపిలో అసలు లీడర్లే ఉండకూడదనే లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు సమాలోచనలు చేసిన దాఖలాలు లేవు. అందులోనూ జిల్లాలో పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు వర్గపోరు ఆరంభమైన చాయలు కనిపిస్తున్నాయి.

మంత్రి అనిల్ కుమార్ ప్రధానంగా నెల్లూరు సిటీ రూరల్ నియోజక వర్గాల మీదనే దృష్టి సారించగా, మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే జిల్లాకు ఇద్దరు ఇన్ చార్జి మంత్రులు మారారు. తొలుత సుచరితని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. వారు ఒకట్రెండు సార్లు జిల్లాకొచ్చి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయారని పార్టీకి సంబంధించిన అంశాలను మాత్రం అస్సలు పట్టించుకోలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇక బిజెపి విషయానికొస్తే ఇటీవల నెల్లూరు జిల్లాకు ఆ పార్టీ ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు టిడిపి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారంతా తమ పార్టీలోకి వస్తారని లెక్కలు వేస్తున్నారు. ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తాయని వారు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రతిపక్ష టిడిపి చకచకా పావులు కదుపుతుంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో వైపు బిజెపి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మరి సింహపురిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరికి మేలు చేస్తాయో ఎవరికి కీడు తెచ్చిపెడతాయో చూడాలి.