మూడేళ్ల కుమార్తెను..100 కోట్లను వదులుకుని

వద్దన్నా లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం..వందకోట్ల ఆస్తులు..ముద్దులొలికే మూడేళ్ల కూతురు..ముచ్చటైన కుటుంబం ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి..జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది..కానీ వీటన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడింది ఒక జంట.. ఎందుకో తెలుసా..? మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌కు చెందిన సుమీత్ రాథోడ్, అనామికలు జైన మతస్థులు..వీరికి రూ.100 కోట్లకు పైగా ఆస్తి, మూడేళ్ల చిన్నారి పాప కూడా ఉంది..అయితే వీరు పాపతో సహా వందకోట్ల ఆస్తిని వదులుకొని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 23న తాము తొలి అడుగు వేసేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. అయితే వీరి నిర్ణయానికి బంధువులతో పాటు సన్నిహితులు, స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. మీ దారి మీరు వెతుక్కున్నారు..మరి పాప పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు ఎంతగా చెప్పి చూసినా ఫలితం మాత్రం శూన్యం..గత నెల 22న సుమీత్ తాను సన్యాసం తీసుకుంటానని చెప్పగా..భార్య అనామిక కూడా భర్త వెంట ఉండేందుకే ఇష్టపడింది. వీరిద్దరూ కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సుధామార్గి ఆచార్య రామ్‌లాల్ మహరాజ్ కింద శిష్యులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపనున్నారు. వీరి సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.