నయీం… పోలీసులకి సస్పెన్షన్! నాయకులకి టెన్షన్!

 

పోలీసులు, రాజకీయ నేతల అండ లేకుండా ఎవరైనా డాన్ గా ఎదగగలరా? అసాధ్యం. కాని, మాఫియా, పొలిటీషన్స్, పోలీసుల సంబంధాలు దాదాపు ఎప్పుడూ నిరూపితం కావు. ఎందుకంటే, రాజకీయ నేతలు తమని తాము కాపాడుకుంటారు. తమతో పాటూ తమకు ఎంతో అవసరమైన పోలీసుల్ని కూడా బాగానే కాపాడతారు. ఇక మిగిలింది ప్రాణాలకు తెగించి ప్రాణాలు తీసే బిజినెస్ చేసిన మాఫియా డాన్లు. వీళ్లు నేతలకి, పోలీసులకి ఉపయోగపడ్డంత కాలం బండి నెట్టుకొస్తారు. ఎక్కడో ఏ చిన్న తేడా వచ్చినా… శాల్తీలు లేచి పోతుంటాయి! నయీం అలాంటి బెడిసికొట్టిన మాఫియా బాంబే!

 

కేవలం నయీమే కాదు… చాలా మంది మాఫియా వారు పోలీసుల్ని తప్పించుకు తిరుగుతుంటారు. కాని, నిజానికి వార్ని ఖాకీలు, రాజకీయ నేతలే చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. దాని వల్ల ఇద్దరికీ లాభముండటమే ఈ వ్యూహానికి కారణం. దావూద్ అయినా, గల్లీల్లో వుండే దాదా అయినా… అంతటా ఒకటే రూల్ అప్లై అవుతుంది! ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దావూద్ తన వేల కోట్ల దందా హ్యాపీగా చేసుకోటానికి కారణం… ముంబై పోలీసుల్లోని చాలా మంది అధికారులు, మహారాష్ట్ర రాజకీయ నేతలే! అయితే, ఇది సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయటం మాత్రం కష్టమే!

 

దావూద్ లాగే తమిళ అడవి దొంగ వీరప్పన్ కూడా పోలీసులు, రాజకీయ నేతలకి చాలా దగ్గరి వాడుగా వుండేవాడట. ఆయనకి సాయం చేసిన స్వార్థపరులు ఎవరో తెలియదుగాని… వీరప్పన్ న్యూసెన్స్ ఎక్కువైపోయిందని అనినిపించిన వెంటనే అతడ్ని అమాంతం వేసేయించారు. నయీం కూడా అలానే చేసుకున్నాడు. కొరివితో తలగోక్కుని అంతమయ్యాడు. ఇక ఇప్పుడు అతడు బతికి వుండగా నయీంతో అంటకాగిన పోలీసులకి, రాజకీయ నేతలకి బ్యాడ్ టైం మొదలైంది. నిజానికి ఆ మధ్య ఓ రిపోర్ట్ లో తమ పోలీసులెవరూ నయీంతో సంబంధాలు పెట్టుకోలేదని రిపోర్ట్ కూడా ఇచ్చారు డిపార్ట్ మెంట్ పెద్దలు. కాని, దానిపై తీవ్రమైన వ్యతిరేక రావటంతో నయీంకు మరీ దగ్గరగా వెళ్లిన అవినీతిపరులైన కొందరు పోలీసులపై వేటు వేయక తప్పలేదు. అంతే కాదు, పోలీసులు కొందరు ఇప్పటికే సస్పెండ్ కాగా కొందరు రాజకీయ నేతలు కూడా జైలుకి వెళ్లే ప్రమాదంలో వున్నారు. ఎగ్జాక్ట్ లీ ఎవరు నయీం స్ట్రోక్ ఎదుర్కోబోతున్నారో ఇంకా క్లారిటీ లేదు కాని… ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ స్థాయి వారే డాన్ దెబ్బను అనుభవించనున్నారట!

 

నయీం కేసులో ఎందరు రాజకీయ నేతలు జైలుకి వెళతారో మనకు తెలియదుగాని… పాలిటిక్స్ , రౌడీయిజం ఎప్పటికీ విడదీయలేనివి. సస్పెన్షన్ లు, జైలుకి వెళ్లటాలు వాట్ని ఒకదానికొకటి దూరం చేయలేవు. అందుకు మంచి ఉదాహరణ, ఆర్నాబ్ గోస్వామి బయటపెట్టిన లాలూ, షాహాబుద్దీన్ రిలేషన్! షాహాబుద్దీన్ ప్రస్తుతం జైల్లో వున్న ఒక బీహారీ మాఫియా డాన్. అతడితో ఫోన్లో మాట్లాడిన లాలూ ఆయన కోరుకున్న విధంగా పోలీసు ఉన్నతాధికారుల్ని ట్రాన్స్ ఫర్లు చేశాడు! ఒక మాజీ సీఎం అయి వుండీ….  నిస్సిగ్గుగా ఒక మాఫియా డాన్ ఆర్డర్లు శిరసావహించాడు! భారత దేశంలో రాజకీయాలు, రౌడీయిజం ఎంతలా పెనవేసుకుపోయాయో అర్థం కావటానికి ఈ ఒక్కటీ చాలు…