కేసీఆర్ హ్యాండిచ్చారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు

 

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేతల అసంతృప్తి స్వరం గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఈటల రాజేందర్.. గులాబీ జెండాకు తామే ఓనర్లమని, ఎవరి బిక్ష వల్ల తనకి మంత్రి పదవి రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల వ్యాఖ్యలకు రసమయి బాలకిషన్ మద్దతు తెలిపారు. తాము కడుపులో ఏమీ దాచుకోలేమని, ఈటలకు, తనకు నిజాలు మాట్లాడటం మాత్రమే వచ్చని అన్నారు. తామిద్దరం ఉద్యమ నేతలమనీ, తమకు అబద్దాలు ఆడటం చేతగాదంటూ రసమయి వ్యాఖ్యానించారు.

ఈటల, రసమయి వ్యాఖ్యలు మరువకముందే టీఆర్ఎస్ లో మరో సీనియర్ నేత అసంతృప్తి స్వరం వినిపించారు. తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే ‘కౌన్సిల్‌లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా’ అని కేసీఆరే అన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని చెప్పారు. 

తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటున్న వ్యాఖ్యలపై నాయిని స్పందించారు. ఆ పదవి తనకు వద్దని, అందులో రసం లేదని తన అసంతృప్తిని వెళ్లగక్కారు. రాష్ట్ర హోంమంత్రిగా పని చేసిన తాను మళ్లీ అలాంటి పదవులు ఎలా తీసుకుంటానని అన్నారు. పార్టీలోకి వచ్చిన కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయిని వ్యాఖ్యానించారు. గులాబీ జెండాకు తామంతా ఓనర్లమే, సీఎం కేసీఆర్ మా ఇంటికి పెద్ద అని నాయిని వ్యాఖ్యానించారు.