గుంటూరులో పేదలకు నాట్స్ సాయం

100 కుటుంబాలకు బియ్యం పంపిణీ

 

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహాయం చేసింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న 100 కుటుంబాలకు నెలకు సరిబడ్డ బియ్యాన్ని పంపిణీ చేసింది. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. లాక్ డౌన్ సమయంలోనూ అనేక మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన నాట్స్ ఇప్పుడు పేదరికంలో మగ్గుతున్న వారికి చేయూత నిస్తోంది.

 

కరోనా మహమ్మారిలో పని లేక ఇబ్బందులు పడుతున్న గుంటూరు నగరంలో 100 కుటుంబాలకు నాట్స్ న్యూజెర్సీ విభాగం నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. నాట్స్ సెక్రటరీ రంజీత్ చాగంటి సహకారంతో న్యూజెర్సీ నాట్స్ విభాగం వరుసగా ఇలా పేదలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టింది. గుంటూరు లోని నెహ్రునగర్, డొంక రోడ్డు ప్రాంతాల్లో నాట్స్ ఇలా నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు భరోసా ఇచ్చింది. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రంజిత్ చాగంటి చూపిన చొరవను నాట్స్ జాతీయ నాయకత్వం ప్రశంసించింది. ఒక వైపు పనుల్లేక ఇబ్బందులు పడుతున్న తమకు నాట్స్ మేమున్నామంటూ సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని పేదలు హర్షం వ్యక్తం చేశారు.