సాగులో ఆమె..

అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే మహిళలు వ్యవసాయరంగంలోనూ ముందంజలో ఉంటున్నారు. రైతు కూలీలుగానే కాదు రైతులుగా మారి లాభసాటి వ్యసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యసాయరంగం పై ఆధారపడిన మనదేశంల్లో మహిళలు కొత్తపంథాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నేల చదును చేసి విత్తనాలు నాటి, పంటనుంచి ధాన్యాన్ని సేకరించి, ఇంటికి చేర్చి ఆహారంగా మార్చి ఇంటిల్లిపాదికి అందించడం వరకు మహిళల పాత్ర ఉంటుంది. మహిళా రైతుల సంఖ్య  భారతీయ వ్యవసాయ రంగంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు పరిశీలిస్తే 75శాతం మహిళా శ్రామికులు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో  సగటున మహిళలు 3,845గంటలు పనిచేస్తున్నారు. నాట్లు వేయడంలో 557 గంటలు, కలుపు తీయడంలో 640గంటలు, పంటకు నీరు పెట్టడంలో 384 గంటల సమయాన్ని గడుపుతున్నారు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొందరు తిరిగి ప్రారంభిస్తుంటే.. సాఫ్ట్ వేర్ రంగాలను వదిలి సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరి గురించి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

 

సురేఖ...
పుట్టిపెరిగింది నగరం వాతావరణంలో.. కానీ మొక్కలంటే మక్కువ. ఉన్నతవిద్య పూర్తి చేసిన తర్వాత రెండు దశాబ్దాలపాటు ఆమె  మీడియా, అడ్వటైజింగ్, కార్పోరేట్ ట్రైనింగ్ ఫీడ్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యకోసం వెళ్లేవారికి సంబంధిత యూనివర్సటీలా ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ ఇస్తూ మూడు కోర్సులు, ఆరు క్లాసులు గా బిజీబిజీగా ఉన్న లైఫ్ లో వ్యవసాయం పై మక్కువ మాత్రం తగ్గలేదు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేక్ పడగా.. ఇదే సరైన సమయం అనుకుంటూ గ్రామం వైపు పరుగుదీశారు. నగరానికి చేరువగా ఉన్న గ్రామంలో ఆరు ఎకరాల పొలం లీజుకు తీసుకున్నారు. వ్యసాయంపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూ మట్టివాసనను ఆస్వాదిస్తున్నారు.
వ్యసాయం లాభసాటిగా ఉండాలంటే అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతుల గురించి అవగాహన ఉండాలి. రైతులకు ప్రభుత్వం సమాచారాన్ని అందించాలి అంటూ అగ్రికల్చర్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. నేల రకాన్ని పరీక్షించడంతో పాటు పంట పెరుగుదలలో తీసుకోవల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎసీ గదుల్లో కోచింగ్ ఇచ్చిన తాను ప్రకృతి మధ్య కు వచ్చిన వ్యసాయపాఠాలు నేర్చుకుని మరికొందరికీ ఆధునిక, లాభసాటి వ్యవసాయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పేముందు నేను తెలుసుకోవాలి కదా అంటూ తానే స్వయంగా పొలం పనుల్లో దగారు. భూసారాన్ని పరీక్షించడం నుంచి నాట్లు వేసే వరకు తానే ముందున్నారు.

 

కృష్ణవేణి...
వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు. మట్టి పరిమళం బాగా తెలుసు. పల్లె నుంచి పట్టణానికి పోయినా ఆ మట్టి పరిమళాన్ని మరిచిపోలేదు.  పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలతో ఏ కాస్త సమయం దొరికిన సామాజిక సేవ చేస్తూ బిజీబిజీగా మారారు. పిల్లలు పెద్దవారై కాస్త తీరిక దొరకగానే ఆమె ఆలోచనలు తిరిగి వ్యవసాయం వైపు మళ్లాయి. ఊరిలో తమకు ఉన్న వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వకుండా తానే దగ్గర ఉండి సాగు చేయిస్తున్నారు. తాను చిన్నప్పుడు చూసిన సంప్రదాయ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం అంటే ఇతరుల సాయంతో ఇతరులకు సాయంచే జీవనవిధానం అంటారు కృష్ణవేణి. పంట కోసిన తర్వాత తమ పశువులకు ఆహారం కోసం వెతికే గొర్రెకాపరులకు తమ పొలంలోకి అనుమతి ఇస్తారు. ఎండాకాలంలో దాదాపు రెండు నెలల పాటు గొర్రెలు,మేకలు, పశువులు  పొలంలో దొరికే చెట్టుచేమ తింటూ అక్కడ పేడ వేస్తాయి. ఈ పేడ పొలానికి మంచి ఎరువు అవుతుంది. పంటలేని కాలంలో పశువుల మేతకు అనుమతించడం వల్ల అవి వేసే పేడ ఎంతో మేలు చేస్తుందని ఇది తన చిన్నతనంలో చూసేదాన్ని అని ఆమ చెప్పారు. ఇప్పుడు పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారు. అప్పుడు పశుపక్ష్యాదులతో కలిసి వ్యవసాయం చేసేవారు అంటారు కృష్ణవేణి.

 

విశాల..
నగరాలను మార్కెటింగ్ చేసే కార్పొరేట్ వ్యక్తి విశాల. హైదరాాబాద్ ఐటీ క్యారిడార్ లో వీకెండ్స్  మార్నింగ్ టైమ్ లో స్టాఫ్ వేర్ పీపుల్  అంతా బయటకు వచ్చి మాస్  ప్రోగ్రామ్స్ చేసేలా రహ్ గిరి రూపకల్పన చేసిన వారిలో ఆమె ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ చేసినా తమ మూలాలు పల్లెలోనే అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకే పల్లెవైపు అడుగువేశారు. రాయలసీమలోని తమ గ్రామంలో ఉన్న పొలంలో చిరుధాన్యాలు పండించడంతో పాటు డాటర్స్ ఆఫ్ సాయిల్ పేరుతో ఎప్ బీ పేజీని క్రియేట్ చేశారు. వ్యసాయరంగంలో మహిళ పాత్రను అంతర్జాతీయ వేదికపై తెలియజేసేందుకు కృషి చేస్తున్నారు. మిల్లెట్స్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి చిరుధాన్యాలకు మార్కెంటింగ్ కల్పించే ప్రయత్నం చేస్తుననారు. దీనితో పాటు సనాతన వ్యవసాయ పద్ధతులను ఆధునిక తరానికి అందించేందుకు మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 

నిర్మల...
విదేశాల్లో ఉద్యోగం. ఐదంకేల జీతం. కానీ, తాను పుట్టిపెరిగిన సమాజానికి ఎదో చేయాలన్న ఆరాటం. అంతే ఆమె అమెరికా నుంచి మారుమూల గ్రామానికి పయనం. మొదట సామాజిక అంశాలపై స్టడీ చేయాలనుకున్నారు. కానీ, వ్యవసాయం రంగంలో చిన్నసన్నకారు రైతులు, మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలను చూసి తాను పనిచేయాల్సింది ఈ రంగంలోనే అనే నిర్ణయానికి వచ్చారు. వలసలకు మారుపేరు అయిన పాలమూరు జిల్లాకు అమెరికా నుంచి ఆమె వలస వచ్చారు. నారాయణపేట్, దామరగిద్ద ప్రాంతంలోని రైతులను కలుసుకుంటూ గత ఐదేండ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లుతూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పేదవారికి పంచిన గుట్టలు, బండరాళ్లతో ఉన్న భూమిని రైతుల శ్రమదానంతో సాగులోకి తీసుకువచ్చారు. సాగునీటి సౌకర్యం అంతగా లేని ప్రాంతంలో వర్షాధార పంటలైన చిరుధాన్యాలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు పండించిన పంట దళారీల ప్రమేయంలేకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా కృషి చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళా రైతులకు శిక్షణ ఇచ్చేప్రయత్నాలు చేస్తూ వ్యవసాయరంగాన్ని నమ్ముకున్నవారిని
కష్టాల నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

 

రేణుక
మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాదు అనారోగ్యాల నుంచి రక్షణ ఇచ్చేలా ఉండాలి అంటున్నారు మహిళా రైతు రేణుక. కాలగర్భంలో కలిసిపోయిన వరివంగడాలను సేకరించి తిరిగి వాటిని సాగులోకి తీసుకువస్తున్నారు. సేంద్రీయవ్యవసాయం తాను చేయడమే కాకుండా తమ ఇరుగుపొరుగు వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. రేణుక సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం క్యాన్సర్ కారణంగా ఆమె మామగారు చనిపోవడం. ఆహారం, జీవనశైలీ కారణంగానే దీర్ఘకాలిక సమస్యలైన క్యాన్సర్, మధుమేహం, కీళ్లనొప్పులు, గుండెజబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పడం ఆమెను ఆలోచింప చేసింది. మరి మన తాతముత్తాలు ఏం తినేవారు అన్నదిశగా సాగిన ఆలోచనలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన పురాతన వరి వంగడాలను సేకరించేలా చేశాయి. ఆమె భర్త తిరుపతి సహాకారంతో దాదాపు 51రకాల పాత వరి వంగడాలను సేకరించి వాటిని పండిస్తూ విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా పంపిణి చేస్తున్నారు.

 

వ్యవసాయరంగంలో కూలీలుగానే కాదు ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడే మహిళలు ఎందరో ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఈ ఐదుగురు మహిళలు. ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని పండిస్తూ సమాజాన్ని ఆరోగ్యదాయకంగా చేసే ప్రయత్నం చేస్తూ వ్యవసాయరంగంలో ఉన్న ప్రతి మహిళకు జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హాట్సాఫ్...