ఇండియా కొవ్వెక్కిపోతోంది....

 

చిన్న పిల్లలు బొద్దుగా వుంటే ముద్దొస్తారు! పెద్ద వాళ్లు బుద్దిగా వుంటే మెప్పిస్తారు! ఇది అందరికీ తెలిసిందే! కాని, మన దేశంలో గత పదేళ్లలో పెద్దవాళ్లు బుద్దిగా అస్సలు వుండటం లేదు. అందుకే, బొద్దుగా తయారవుతున్నారు! ఇదేంటి అంటారా? తాజాగా విడుదలైన ఓ సర్వే ఫలితాలు చూస్తే దేశం ఎంతగా బరువెక్కిపోతోందో మనకు అర్థమవుతుంది!

 

మనిషి తక్కువ బరువు వుండటం ఎంత ప్రమాదమో... అంకన్నా ఎక్కువే ప్రమాదం, అధిక బరువు! ఈ మధ్య లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల చూస్తుంటే జనం లావెక్కిపోతున్నారు. కిలో నుంచి మొదలై పది, ఇరవై, ముప్పై కిలోలు అధిక బరువు తూగేస్తున్నారు. దీని వల్ల ఆగకుండా చెమటలు పోయటం లాంటి చిన్న సమస్య మొదలు గుండె ఆగిపోవటం వరకూ బోలెడు ఇబ్బందులు, ప్రమాదాలు వున్నాయి. అయితే, ఆందోళనకరంగా ఇండియాలో అధిక బరువు రోజు రోజుకూ అధికమవుతోంది! మగవాళ్లలో ఉధృతంగా బరువు పెరిగే ట్రెండ్ కనిపిస్తోందంటున్నారు! 2005-06 సంవత్సరంలో భారతీయ పురుషులు 9.3 శాతం మంది ఓవర్ వెయిట్ వుండేవారట! పదేళ్ల తరువాత, అంటే, 201-16 కల్లా ఆ శాతం ఎంత పెరిగిందో తెలుసా? 18.6 శాతం! అంటే, నూటికి నూరు శాతం మంది పురుషులు బరువు పెరిగిపోయారట! పైగా ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లం ఓవర్ గా  వుంటోంది సిటీల్లోనే. నగరా జనాభాలో 26.3 శాతం మంది మగవారు భారీకాయాలతో బాధపడుతుంటే ఊళ్లలో 14.3 శాతం మంది మాత్రమే కొవ్వెక్కిపోయారట!

 

ఆడవారి పరిస్థితి కూడా బెటర్ గా ఏం లేదంటోంది సర్వే! 2005-06లో 12.6 శాతం మంది భారతీయ మహిళలు బొద్దుగా వుంటే ఇప్పుడు వారి సంఖ్య 20.7 శాతానికి చేరుకుంది! పదేళ్లలో నిండైన మహిళలు సంఖ్య తీవ్రంగా పెరిగినట్టే లెక్క! స్త్రీలు కూడా నగరాల్లో 31.3 శాతం మంది లావుగా వుంటే గ్రామాల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే కదలటానికి ఆయసపడుతున్నారట!

 

గుండెల్ని బరువెక్కించేలా కేంద్ర ప్రభుత్వ అధికారిక కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలిన ఈ బరువైన సత్యాలు ఒక్క విషయం స్పష్టం చేస్తున్నాయి. దేశం మొత్తం ఆడ, మగా తేడా లేకుండా అందరూ బరువు పెరుగుతోన్నా... సిటీల్లో కంటే ఊళ్లలో అధిక బరువు సమస్య తక్కువగా వుంది. నగరాల్లోనే అధిక బరువు అధికంగా వుంటోంది. దీని అర్థం ఏంటి? సిటీ లైఫ్ స్టైల్, లేదా ఊళ్లలో వున్నా  శారీరిక శ్రమకి దూరంగా వుంచే నగరాన్ని జీవితాన్ని పాటించటం... ఇదే మన కొంపలు ముంచుతోంది! మనసుకు మత్తెక్కి తక్కువ శరీర శ్రమ చే్స్తే ఒళ్లు కొవ్వెక్కటం ఖాయం. అనారోగ్యంతో మనసు బరువెక్కటమూ ఖాయం! అందుకే, లావు తగ్గటానికి, లేదంటే లావు పెరగకుండా వుండటానికి... వెంటనే నడుం బిగించాలి. కాదు కాదు, నడుం వంచి శ్రమించాలి!