పాకిస్తాన్ జాతిపితకు ముంబైలో ప్యాలెస్! కూల్చేయాల్సిందేనా?

 

మహ్మాద్ ఆలీ జిన్నా... ఈయనెవరో మనలో చాలా మందికి తెలిసే వుంటుంది! ఎందుకంటే, జిత్తులమారి జిన్నా లేకుంటే దేశ విభజన జరిగేది కాదని చాలా మంది విశ్వసిస్తారు ఇప్పటికీ. అటు పాకిస్తాన్ కూడా తమ దేశ జాతిపితగా జిన్నానే పేర్కొంటుంది. కారణం... అఖండ భారత్ ని అడ్డంగా చీల్చి పాకిస్తాన్ అనే ఇస్లామిక్ దేశాన్ని ఆయన ఏర్పాటు చేయించాడు. స్వాతంత్ర్యం కోసం హిందువులు, ముస్లిమ్ లు కలిసి పోరాడితే సరిగ్గా స్వేచ్ఛ సిద్ధించే వేళ మతం ఆధారంగా జాతిని ముక్కలు చేశాడు. ఆ తరువాత ఇప్పటికీ ఆధ్వాన్నంగా నడుస్తోన్న పాక్ అనే ఉగ్రవాద దేశానికి ఆయనే కారణమయ్యాడు!

 

జిన్నా చారిత్రక పాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంతగా ఇండియా, పాకిస్తాన్లను ఆయన ప్రభావితం చేశాడు. అయితే... భారతీయులు ద్వేషించే , పాకిస్తానీలు ప్రేమించే జిన్నా ప్యాలెస్ ఒకటి ఇంకా మన ముంబైలో వుందని మీకు తెలుసా? వేల కోట్లు ఖరీదు చేసే ఈ సువిశాల కట్టడం ముంబై సముద్ర తీరానికి ఎదురుగా వుటుంది. అందులో స్వతంత్రం తరువాత కూడా చాలా ఏళ్లు బ్రిటీష్ హై కమీషనర్ వుండేవాడు. 1982 తరువాత జిన్నా కుటుంబానికి చెందిన ఆ కోటని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పాడుబడి శిథిలమైపోయింది.

 

తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపి ఎమ్మెల్యే ఒకరు జిన్నా ప్యాలెస్ గురించి చర్చ లేవనెత్తారు. అదే కట్టడంలో కూర్చుని జిన్నా దేశ విభజన జిత్తులు పన్నాడని ఆయన ఆరోపించారు. అందుకే, ప్రభుత్వం వెంటనే ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేసి కొత్తగా ఒక సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని కోరారు. జాతి గుండెపైన గాయం లాంటి అటువంటి కట్టడం ఇంతకాలం వుంచినప్పటికీ... ఈ మధ్య అమల్లోకి వచ్చిన ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం ద్వారా దాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు!
ఇప్పటికే శిథిలమైపోయిన జిన్నా ప్యాలెస్ తొలగించటం పెద్ద తప్పేం కాదు. ఇక బీజేపి సర్కార్ ఆ పనికి పూనుకుంటోంది కాబట్టి కాంగ్రెస్, ఎన్సీపీ లేదా శివసేన లాంటి పార్టీలు రాజకీయ ఉద్దేశ్యాలతో అభ్యంతరాలు ఏమైనా చెప్పినా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, జిన్నా జ్ఞాపకాల్ని తొలగించి ఒక మంచి సాంస్కృతిక చిహ్నం నిర్మిస్తే భారతీయులు తప్పక హర్షిస్తారు! ఆఫ్ట్రాల్... శత్రువు ఫోటోను ఫ్రేమ్ కట్టి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటరా? ఇదీ అంతే!