విక్రమ్ కథ ముగిసినట్టేనా.. ఇస్రో వీడ్కోలు ట్వీట్!!

 

చంద్రయాన్‌-2లో భాగంగా ఇస్రో  చంద్రుడి దక్షిణ ధృవంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం కంచికి చేరినట్టే కనిపిస్తోంది. చంద్రుడికి అత్యంత సమీపకక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్‌ విక్రమ్‌‌తో చివరి నిమిషంలో సంబంధాలు తెగిపోవడంతో యావత్ భారత్ దిగ్భ్రాంతికి లోనైన సంగతి తెలిసిందే. దీంతో విక్రమ్‌ జాడ కనుక్కునేందుకు సాయపడడానికి.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ముందుకు వచ్చింది. అయితే విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించి ఫొటోలు తీయడంలో నాసా చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైనట్లు కనిపిస్తోంది. నాసా ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో కూడా విక్రమ్ ల్యాండర్ ఆనవాళ్లు కనిపించలేదు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఆర్బిటర్ ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లో ఎక్కడా విక్రమ్‌ జాడ కనిపించడం లేదని, తమ ఆర్బిటర్‌ చంద్రుని ఉపరితలానికి అతి దగ్గర నుంచి ఫొటోలు తీయడం వల్ల నీడ ఎక్కువగా పడిందని నాసా తెలిపింది.

నాసా చివరి ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో ఇస్రో 'విక్రమ్ ల్యాండర్‌' పై ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 ప్రయోగం గురించి తాజాగా ఇస్రో ఓ భావోద్వేగ ట్వీట్ చేసింది. తమకు అండగా నిలిచిన వారందరికీ ఇస్రో ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలను, ఆకాంక్షలను సాధించే దిశగా ప్రయత్నిస్తూనే ఉంటామని ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.