నారా వర్సెస్ నార్నె.. అప్పుడే వేడెక్కిన మంగళగిరి

 

నారా లోకేష్ పోటీ చేసే స్థానం ఖరారైంది. నిన్నటి వరకు ఆయన భీమిలి లేదా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా చంద్రబాబు.. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగుతారని స్పష్టం చేసారు. అయితే లోకేష్ సీటు అలా ఖరారు అయిందో లేదో.. అప్పుడే ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. లోకేష్ కి పోటీగా వైసీపీ ఓ అనూహ్య వ్యక్తి పేరు తెరమీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. నార్నె రీసెంట్ గా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి.. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల మెజారిటీతో మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా లోకేష్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. లోకేష్ కి చెక్ పెట్టడానికి నార్నె ని బరిలోకి దింపడమే కరెక్ట్ అని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. గుంటూరు జిల్లాకి చెందిన నార్నె.. నారా, నందమూరి కుటుంబాలకు దగ్గరి బంధువు.. ఆర్థికంగా కూడా బలమైన నేత. దగ్గర బంధువు కావడంతో లోకేష్ అంత త్వరగా ఆయన్ని టార్గెట్ చేసి విమర్శలు చేయలేరు. నందమూరి అభిమానుల్లో కూడా కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ కి నార్నె శ్రీనివాస్ కరెక్ట్ అభ్యర్థి అని వైసీపీ భావిస్తోందట. అదే జరిగితే ఎన్నికల వేళ నారా వర్సెస్ నార్నె హాట్ టాపిక్ అవ్వడం ఖాయం.