కాశ్మీర్‌పై మోదీ సరికొత్త వ్యూహం… అసలుకే మోసమా?  

దేశంలో చాలా చోట్ల వలస రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పార్టీ నుంచీ గెలిచి మరో పార్టీలోకి దూకేవారు మరీ ఎక్కువైపోతున్నారు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపేం కాదు. అయితే, దేశాన్ని ఏలుతోన్న బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ఎంపీల విషయంలో బేరసారాలు చేసే అవసరం మోదీ సర్కార్ కు లేదు. కానీ, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల విషయంలో చాలా చోట్ల ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూనే వున్నాయి. దక్షిణాదిలో తమిళనాడులో, కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ఓ రేంజ్లో నడవటం మనం చూశాం. అయితే, ఉత్తరాదిలోనూ కమలం జంప్ జిలానీలతో రాజకీయం రక్తి కట్టిస్తోంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశారు అమిత్ షా. ఎన్నికలకు ముందు తరువాత అన్న భేదం లేకుండా వలలు వేసి పట్టేశారు. తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే అధికారంలో వున్న కాంగ్రెస్ ని అమాంతం కూల్చేశారు! ఇక ఇప్పుడు ఇదే అమిత్ షా మార్కు రాజకీయం వివాదాస్పద జమ్మూ కాశ్మీర్ కు మారటంతో అందరి దృష్టి పార్టీ ఫిరాయింపు పాలిటిక్స్ పై పడింది!

 

 

కాశ్మీర్ దేశంలోనే అత్యంత సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రం. దానితో పదే పదే మన కేంద్ర ప్రభుత్వాలు తప్పుగా వవ్యహరించి సమస్య మరింత జటిలం చేస్తూ వచ్చాయి. గతంలో అనేక సార్లు కాశ్మీర్ అంశంతో కాంగ్రెస్ ఆటలాడింది. ఇప్పుడు బీజేపీ సర్కార్ కూడా వివాదాస్పద ధోరణి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. చివరకు దీని ఫలితం మంచా? చెడా? తెలియని విధంగా పరిస్థితి నెలకొంటోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన ఘాటు కామెంట్ అందుకు నిదర్శనం!

దిల్లీ పెద్దలు పీడీపీ పార్టీని చీల్చాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ముఫ్తీ హెచ్చరించారు. ఇందుకు కారణం పీడీపీలోని అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్ లాంటి బీజేపీ నేతలు టచ్ లో వుండటమే. ఈ మధ్యే పొత్తుకు స్వస్తి చెప్పి ప్రభుత్వాన్ని కూల్చిన కమలదళం ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. మెహబూబా ముఫ్తీ పార్టీని చీల్చి తమ స్వంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. అదే జరిగితే పీడీపీ ఇక చరిత్రలో కలిసిపోవాల్సిందే. అందుకే, తాము హింసకైనా సిద్దమన్నట్టు మాట్లాడుతోంది మెహబూబా.

 

 

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తమ ప్రభుత్వాలు వుండాలనుకోవటం వేరు. కాశ్మీర్ విషయంలోనూ అదే నీతి ప్రద్రర్శించటం వేరు. ఎందుకంటే, సమస్యాత్మకంగా వున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో బేరాసారాలు నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనం రెచ్చిపోయే ప్రమాదం వుంది. వేర్పాటు వాదులు మరింత రెచ్చగొట్టే అవకాశమూ వుంది. ఇక పాకిస్తాన్ ఎలాగూ గోతి కాడి నక్కలా చూస్తూనే వుంటుంది. కాబట్టి ప్రస్తుతం గవర్నర్ పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అదే కొనసాగించి సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా గోడ దూకిన ఎమ్మెల్యేలతో సర్కార్ ఏర్పాటు చేస్తే నిత్యం రాష్ట్రమంతా గందరగోళం నెలకొనవచ్చు. దాని పై సరైన అంచనా వుండాల్సిందే!

కొందరి అభిప్రాయం ప్రకారం బీజేపీ పీడీపీ పార్టీని చీల్చి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కారణం… ఆర్టికల్ 370 నిర్మూలనట! రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేనిదే ఆ ఆర్టికల్ తీసేయటం కుదరదు. కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీర్మానం చేయించి ఆర్టికల్ 370 తొలగిద్దామని మోదీ ఆలోచిస్తున్నారట. ఇది హర్షించదగిని వ్యూహమే అయినా సులవైంది మాత్రం కాదు. ప్రజా వ్యతిరేకత, దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ఉగ్రవాదులు పెను సవాళ్లు అయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మోదీ ఏం చేసినా ఆచితూచి చేయాలి. లేదంటే లాభం కంటే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదముంది. పైగా పాకిస్తాన్ ఈ వ్యవహారమంతా అంతర్జాతీయంగా తనకు అనుకూలం చేసుకునే వీలు కూడా వుంది!