మోడీ ప్రతిపాదనలో మర్మమేమిటో

 

జమ్మూ మరియు కాశ్మీరు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం సహాయ చర్యలకు ఆదేశించారు. అది కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా కాక జాతీయ విపత్తుగా భావిస్తున్నానని తెలిపారు. అంతే కాదు పాకిస్తాన్ కోరితే పాక్ ఆక్రమిత కాశ్మీరులో కూడా తమ ప్రభుత్వం సహాయచర్యలు చేప్పట్టేందుకు సిద్దంగా ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితమే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్నిఏకపక్షంగా రద్దు చేసుకొన్న భారత్, మళ్ళీ ఈవిధంగా స్పందించడంలో మర్మమేటని పాకిస్తాన్ తో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా తలపట్టుకొన్నాయి.

 

ఇటువంటి క్లిష్ట సమయంలో భారత్ చేసిన ఈ ప్రతిపాదనను రాజకీయాలతో ముడిపెట్టడం సమజసం కాదని అందరూ అంగీకరిస్తారు. కానీ పాక్ అధీనంలో ఉన్న భారత భూభాగంలో భారత్ సహాయ చర్యలు చెప్పట్టడం కోసం పాకిస్తాన్ అనుమతి కోరడం అంటే దానిపై పాక్ సార్వభౌమత్వం అంగీకరించినట్లే కదా? ఇంత కాలంగా ఆ భూ భాగాన్ని ‘పాక్ ఆక్రమిత భారత భూభాగమని’ చెప్పుకోవడమే కాకుండా భారతదేశ మ్యాపులో కూడా దానిని భారత్ అంతర్భాగంగా చూపిస్తున్నపుడు, మోడీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో సహాయ చర్యలు చేప్పట్టేందుకు పాక్ ప్రభుత్వ అనుమతి కోరడం లేదా పాకిస్తాన్ కు అటువంటి ప్రతిపాదన చేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఆ ప్రతిపాదనను రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్దరించుకొనే ప్రయత్నంలో చేసినవే తప్ప వేరేగా చూడరాదని మరి కొందరి వాదన.

 

ఏమయినప్పటికీ మోడీ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ఏవిధంగా స్పందించాలో తెలియక పాకిస్తాన్ కూడా తికమక పడినట్లే ఉంది. అందుకే దానికి అవునని కానీ కాదని కానీ స్పష్టంగా సమాధానం చెప్పకుండా 'భారతప్రభుత్వం కోరితే దాని అధీనంలో ఉన్న కాశ్మీరు ప్రాంతంలో తమ బృందాలు సహాయ చర్యలు చెప్పట్టగలవని' గడుసుగా బదులిచ్చింది. అదెలా ఉందంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది. ప్రజల తిరుగుబాటు కారణంగా ఏ క్షణంలో కుప్ప కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న పాక్ ప్రభుత్వం, ముందు తన కుర్చీ క్రింద అంటుకొన్న మంటలను ఆర్పుకోలేకపోయినా, మేకపోతు గాంభీర్యం, అనవసర లౌక్యం ప్రదర్శిస్తూ భారత భూభాగంలో సహాయ చర్యలు చేపడతానని చెప్పడం హాస్యాస్పదం. అయితే దాని భయాలు దానికీ ఉన్నాయి.

 

ఒకవేళ భారత సహాయ బృందాలను ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తే, ఆ వంకతో భారత్ గూడచారులు అక్కడ మాటు వేసిన పాక్ ఉగ్రవాదుల గుట్టు బట్టబయలు చేస్తారనే భయం ఉండి ఉండవచ్చును. అందుకే భారత్ ప్రతిపాదనకు సూటిగా సమాధానం చెప్పకుండా లౌక్యం ప్రదర్శించిందనుకోవాల్సి ఉంటుంది. అయితే కాశ్మీరులో సహాయ చర్యలు చెప్పట్టేందుకు భారత్ కు పాకిస్తాన్ సహాయం అవసరం లేదనే సంగతి దానికీ తెలుసు. ఒకవేళ భారత ప్రభుత్వం పాక్ బృందాలను కాశ్మీరులోకి అనుమతిస్తే, ఆ వంకతో పాక్ ఉగ్రవాదులు దేశంలో చొరబడే ప్రమాదం ఉంది కనుక భారత్ కూడా పాక్ ప్రతిపాదనపై స్పందించలేదు.

 

ప్రస్తుతం రెండు దేశాల నడుమ సాగుతున్న ఈ వ్యవహారం, మోడీ ప్రభుత్వానికి నిర్దిష్టమయిన విదేశాంగ విధానం కానీ దానిపై సరయిన అవగాహన కానీ లేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు మరో అవకాశం కల్పించినట్లయింది.

 

భారత్-పాక్ ల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండటం చాలా అవసరమేనని అందరూ అంగీకరిస్తారు. కానీ పాక్ ప్రభుత్వంపై సైన్యం, మత ఛాందసవాదులు కర్ర పెత్తనం చేస్తునంత కాలం అది ఎన్నటికీ సాధ్యం కాదనే సంగతి అందరికీ తెలుసు. కనుక మోడీ ప్రభుత్వ ప్రతిపాదనలో మంచి చెడ్డల గురించి చర్చించుకోవడం తప్ప కొత్తగా జరిగేది, ఒరిగేదీ ఏమీ ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును.