నరేంద్ర మోడీ చెప్తున్న కొత్త భాష్యాలు

 

నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్నిముఖ్యమంత్రిగా పాలిస్తున్న2002 సం.లో ఆ రాష్ట్రంలో జరిగిన దారుణమారణకాండ నేటికీ అయన పాలిట పెను శాపంగా మిగిలిపోయి, దేశానికి ప్రధానిగా చేపట్టగల ఒక మహత్తర అవకాశానికి ఆయనని ఆమడ దూరంలో ఉంచుతోంది. గుజరాత్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకుపోతున్న ఆయన గుజరాత్ రాష్ట్రం బయట కాలుపెడితే చాలు, ఇప్పటికీ నిరసనలు ఎదుర్కోక తప్పడం లేదు. ఆయన చేసిన ఘోర తప్పిదమే ఆయనకు, ఆయన ఉజ్వల భవిష్యత్తుకు మద్య ఒక కనిపించని అడ్డుగోడలా నిలిచి, ఆయన తెలివితేటలకు పరీక్ష పెడుతోందిప్పుడు.

 

ఆయన ఇప్పుడు ఒక ద్వైదీమానమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నానాటికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ, ఆయన సమర్ధతకు ప్రపంచ దేశాల ప్రశంసలు. మరో వైపు, ఎక్కడికి వెళితే అక్కడ నిరసనలు, ఆయన రాకకి అభ్యంతరాలు.

 

ఇటీవల డిల్లీలో శ్రీరాం కాలేజీలో ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినప్పుడు ఆయన చేసిన ప్రసంగంతో లోనున్న విద్యార్ధులు ఎంతో స్పూర్తి పొందగా, అదే కాలేజిలో మరికొందరు విద్యార్దులు బయట నిలబడి ఆయన రాకకు నిరసనలు తెలియజేసారు. ఈ సంఘటన ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న వింత పరిస్థితులకి అద్దం పడుతోంది.

 

ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వైబ్రాంట్ గుజరాత్ సదస్సు’ కు “పాకిస్తాన్” తో సహా అనేక దేశాల నుంచి వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు తరలివచ్చి ఆయనను, ఆయన రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని ఋజువు చేసారు. కానీ, మొన్న అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అమెరికా ప్రభుత్వం విసా నిరాకరించడం ఆయనకు చెంప దెబ్బ అయింది. మానవ హక్కులను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనకు వీసా నిరాకరిస్తున్నట్లు అమెరికా తెలియజేసింది. భావి భారత ప్రధాని కావాలని కలలు కంటున్న నరేంద్రమోడీకి ఇది నిజంగా చెంప దెబ్బే అని చెప్పక తప్పదు. అందువల్ల ఆయన అమెరికాకు స్వయంగా వెళ్ళే అవకాశం లేకపోవడంతో, వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుజరాత్ రాష్ట్రం నుండే ఆయన అమెరికాలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

 

ఇక ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటిసారిగా తన పరిపాలనలో జరిగిన తప్పులు (మారణకాండ) గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ప్రభుత్వం చేసిన తప్పులను కూడా క్షమిస్తారు’ అని అన్నారు.

 

అంటే, తానూ అందిస్తున్న సమర్ధమయిన పాలనతో సంతృప్తి పొందిన ప్రజలు, తనను గెలిపించిడం ద్వారా, వారు ‘తన తప్పులను’క్షమించారని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. తనవల్ల నష్టపోయిన ప్రజలే తనను మన్నించి గెలిపించినప్పుడు, అమెరికా వంటి ఇతరదేశాలు ఇంకా తటపటాయించడం ఏమిటని ప్రశ్నించడం కూడా ఆయన ఉద్దేశ్యం కావచ్చును.

 

కానీ, దాదాపు 1200 మంది ఆమయకులయిన ప్రజల మరణానికి కారకుడని నిందించబడుతున్న ఆయన, కోర్టుల నుండి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకోవచ్చును కానీ, ప్రజల దృష్టిలో, ముఖ్యంగా ఆ దారుణానికి గురయిన వర్గం దృష్టిలోఆయన ఎన్నటికీ నేరస్తుడిగానే మిగిలిపోతారు.

 

మంచి వక్తగా పేరున్న నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో తన తప్పులను కప్పిపుచ్చుకొని దేశభక్తి పూరితమయిన తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేయవచ్చును. కానీ, తానూ స్వహస్తాలతో వ్రాసుకొన్నతన గత చరిత్రను మాత్రం ఆయన ఎన్నటికీ చెరుపుకోలేరు.

 

ఆయన నోటితోనే ఆయన స్వయంగా ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ‘ప్రభుత్వం చేసిన తప్పులను’ కూడా క్షమిస్తారు’ అని చెప్పడం ద్వారా తానూ చేసిన తప్పులను ఆయన పరోక్షంగానయినా అంగీకరించినట్లు అర్ధం అవుతోంది.

 

అయితే, తన తప్పులకు సవరణలు చేసేబదులు, సదరు వర్గం ప్రజలను తనను క్షమించమని బహిరంగంగా ఆయన కోరిఉంటే, వారు ఆయనను క్షమించేవారేమో! ఒకవేళ వారు క్షమించకపోయినా, ఆయన ఆవిధంగా కోరినందుకు మిగిలిన ప్రజలయినా క్షమించేవారేమో! ఏదిఏమయినపటికీ, ఆయన చేసిన తప్పులే ఆయనకు నేడు శాపాలుగా మారి, ఆయనకు అగ్నిపరీక్షలు పెడుతున్నాయని చెప్పవచ్చును. వాటిని ఆయన అధిగమించి తన ప్రసంగంలో చెప్పినట్లు ‘అన్నిటి కంటే దేశమే మిన్న’ అని ఋజువు చేయగలిగితే ఆయన జన్మ ధన్యం అయినట్లే!