ఎట్టకేలకు క్లారిటీ.. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ

 

ఎట్టకేలకు మంత్రి నారా లోకేష్ పోటీ చేసే స్థానం మీద క్లారిటీ వచ్చింది. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. లోకేష్ పోటీపై స్పష్టత ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్ పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు భీమిలి, విశాఖ ఉత్తర  నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి లోకేష్ బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ.. తాజాగా చంద్రబాబు మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారని స్పష్టం చేసారు.

1985 తరువాత నుంచి టీడీపీ ఒక్కసారిగా మంగళగిరిలో విజయం సాధించలేదు. అందుకే లోకేష్ ఇక్కడి నుంచి బరిలోకి దిగి, గెలిచి 30 ఏళ్ళ చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారు. కాగా.. 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి బరిలోకి దిగగా.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంగళగిరి వైసీపీ టికెట్ కష్టమనే ప్రచారం జరుగుతోంది. మరి లోకేష్ కి ప్రత్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి.