ఒక పరాజయం 100 తప్పులు.. లోకేష్ తాను ఓడిపోయి పార్టీని ఓడించాడు!!

 

'నాయకుడు వారసత్వంలోనుంచి పుట్టడు. ప్రజల్లోనుంచి పుడతాడు. అలా పుట్టిన నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.' ఈ విషయాన్ని 4 దశాబ్దాల అనుభవమున్న చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉండడం, కొడుకుని గొప్ప స్థాయిలో చూడాలనుకోవడం సహజం. కానీ తన కొడుకు అసలు ఈ రంగంలో రాణించగలడా లేదా అన్న ఆలోచన లేకుండా.. వారసత్వమే తన కొడుకుని నిలబెడుతుందన్న భావనతో బాబు లోకేష్ ని అందలం ఎక్కించారు. తీరా ప్రజా తీర్పు చూసి ఏడుపు మొహం పెట్టారు.

ఎందరో వారసులు రాజకీయాల్లోకి వచ్చారు.. కొందరు రాణించారు. వారసులు రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు. కానీ ఆ వచ్చే విధానంలోనే మార్పు కనపడాలి. ముందు పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ద్వితీయ శ్రేణి నేతలతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. క్షేత్రస్థాయిలో పని చేయాలి. ప్రజల్లో ఉండాలి. కానీ లోకేష్ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది?. అంతా హైటెక్ మయం. మీడియా, సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండానే డైరెక్ట్ గా మంత్రి పదవి పొందారు. దీంతో సహజంగానే ప్రజల్లో లోకేష్ మీద వ్యతిరేక భావన ఏర్పడింది. దీనికి తోడు లోకేష్ తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని నిజమైన కార్యకర్తలను దూరం పెట్టారు. భజన చేసేవారిని, నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేవారిని, సోషల్ మీడియానే నిజమైన సమాజం అనుకునేవారిని లోకేష్ తన చుట్టూ పెట్టుకున్నారు. దీంతో ఆయన కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరవ్వలేకపోయారు.

ఇక లోకేష్ మాటల తడబాటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నాయకుడికి చేతలతో పాటు వాక్చాతుర్యం కూడా ఉండాలి. తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజ పరచాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. వాక్చాతుర్యంతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టాలి. కానీ లోకేష్ మైక్ పడితే  ప్రత్యర్థి పార్టీలకు పండగే. పదాలను సరిగ్గా పలకకపోవడం లేదా ఒక పదానికి బదులు మరో పదం పలకడం.. ఇలా పదాలతో విన్యాసాలు చేసి ప్రత్యర్థులను కూడా నవ్వించి తాను నవ్వులపాలయ్యాడు. పప్పు అనే పేరు తెచ్చుకున్నాడు. దీన్ని ప్రత్యర్థులు లోకేష్ పేరు వింటే పప్పు అని గుర్తొచ్చే అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

సరే మాటలు తడబాటు సహజం. మిగతా నాయకులు అప్పుడప్పుడు తడబడితే ఈయన ఎక్కువసార్లు తడబడతారు అనుకోవచ్చు. ఇక్కడ లోకేష్ చేసిన ప్రధాన తప్పు.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం. క్షేత్రస్థాయిలో పార్టీలో పనిచేస్తూ కార్యకర్తలకు దగ్గరై, ప్రజల్లోకి వెళ్తే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన మాటలు తడబడినా ఆయన చేతలు చూసి ఆయన వెంట కొందరైనా నడిచేవారు. కానీ లోకేష్ అలా చేయలేదు. డైరెక్ట్ గా మంత్రి అయ్యి తనకి తిరుగు లేదు అనుకున్నారు. తనకి తాను యువరాజులా ఫీలయ్యారు. ఇదే ప్రత్యర్థులకు వరమైంది. ఒక్కసారి గెలిపిస్తే బాబు కొడుకుని మంత్రిని చేసాడు, మరోసారి గెలిపిస్తే ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలకు పదే పదే చెప్పారు. దీంతో ప్రజలు లోకేష్ ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా ఇంటికి పంపారు. పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరి ఈ అనుభవాల నుంచైనా లోకేష్ తన పద్దతి మార్చుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.