వైసీపీ వర్సెస్ టీడీపీ... బెదిరింపులకు భయపడేది లేదన్న లోకేష్... 

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తామంటే భయపడేది లేదంటూ వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తేల్చిచెప్పారు. మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు మండలిలో రూల్ 71ను టీడీపీ తెరపైకి తేవడంతో కౌన్సిల్ రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందని, అయితే తాము ఆ బెదిరింపులకు భయపడేది లేదని నారా లోకేష్ అన్నారు. అయినా, మండలిని రద్దు చేయడానికి జగన్ ప్రభుత్వానికున్న అధికారం ఎక్కడుందని లోకేష్ ప్రశ్నించారు. మండలి రద్దుపై శాసనసభలో తీర్మానం మాత్రమే చేయగలేదని, అయితే తాము కూడా మండలిలో తీర్మానం చేయగలమని అన్నారు. తాము ప్రజాసమస్యలపై చర్చ చేద్దామంటుంటే... ప్రభుత్వం మాత్రం కౌన్సిల్ రద్దు అంటూ బెదిరింపులకు దిగుతోందని నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్నడూలేనివిధంగా 15మంది మంత్రులు సభకు వచ్చారని, పైగా అధికార పార్టీ నేతలు మండలిలో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని లోకేష్ సెటైర్లు వేశారు. అయితే, శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని యనమల రామకృష్ణుడు అన్నారు. కౌన్సిల్ ను రద్దు చేయాలంటే చాలా ప్రక్రియ ఉందని... పార్లమెంట్ ఆమోదిస్తేనే మండలి రద్దు సాధ్యమవుతుందని అన్నారు. ఇదంతా జరగాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని యనమల వ్యాఖ్యానించారు.

ఇక, రూల్ 71 కింద టీడీపీ ఇచ్చిన నోటీస్ పై మండలిలో జరిగిన రగడ సందర్భంగా బొత్స అండ్ యనమల మధ్య వాగ్యుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్సీలకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారంటూ మంత్రి బొత్సను యనమల ప్రశ్నించారు. కౌన్సిల్ ను కించపర్చేలా బొత్స వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాంతో, తాను ఎవరికి ఫోన్ చేశానో నిరూపించాలంటూ బొత్స ఎదురుదాడికి దిగారు.

మొత్తానికి, మండలిలో పరిణామాలు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మండలిలో జరుగుతోన్న పరిణామాలను చూసేందుకు... అలాగే, మండలిలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టేందుకు, గట్టెక్కించేందుకు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కౌన్సిల్ కి వచ్చారు. వీఐపీ గ్యాలరీలో ఉంటూ సభలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు.