సిగ్గుంటే ముందు రాజీనామా చేసి మాట్లాడు... వంశీపై లోకేష్ ఫైర్

 

వల్లభనేని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. వల్లభనేని వంశీ.. నీకు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడు అని ధ్వజమెత్తారు. తన ఆస్తులను కాపాడుకునేందుకే వంశీ టీడీపీని వీడారని ఆయన ఆరోపించారు. ఈరోజు నెల్లూరులో లోకేష్ మీడియాతో మాట్లాడారు. వారం రోజుల క్రితం వంశీ తనతో మాట్లాడి.. ఇప్పుడు యూ టర్న్, జే టర్న్ తీసుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒకరిద్దరి పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని ధీమా వ్యక్తం చేశారు.

వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయనకు షోకాజ్‌ నోటీసులు కూడా పంపింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ  నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలుస్తుంది.

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన వంశీ..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తానేమీ కేసులకు భయపడడం లేదని..లావాదేవీల కోసం సీఎం జగన్ పక్కన చేరడం లేదన్నారు. వర్ధంతికి..జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడుపుతున్నారంటూ పరోక్షంగా లోకేష్‌పై విమర్శలు చేశాడు వంశీ. అలాంటి వాళ్లు తమను అంటే పడాలా అంటూ నిలదీశారు. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో ఉంచుకుంటారా? అంటూ మరోసారి ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలపై తనకు మోజు లేదని వంశీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఘాటుగానే జవాబులు ఇస్తున్నారు. వైసీపీ లో ఉండే వారు ఎవ్వరు కడుపుకి అన్నం తినరని వంశీ ఒక్కప్పుడు మీడియాతో మాట్లాడిన మాటలు బయటకి వచ్చాయి.. అది చూసి " వైసీపీలో ఉన్నన్ని రోజులు వంశీ అన్నం తినకుండా డైటింగ్ చేస్తాడంటూ " సెటైర్ లు వేస్తున్నారు.