లోకేష్ బాబు శకం మొదలైనట్టేనా?

రాజకీయాలు నది లాంటివి! ఇలా ఎందుకు అనాలి అంటే… అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలతో పాటూ పాలిటిక్స్ లోకి కొత్త నీరు వస్తూనే వుంటుంది. అచ్చం నదీ ప్రవాహంలో లాగే నిరంతరం కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనూ వచ్చినట్లు కనిపిస్తోంది! ప్రస్తుతం నడుస్తోన్న చంద్రబాబు శకం… 2019తో ముగిసి… లోకేష్ శకం అరంభం అవ్వనుందా? తాజా పరిణామాలు ఆ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

 

 

లోకేష్ ఓ మీటింగ్ లో సంచలన ప్రకటన చేశారు! కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బహిరంగ సభలో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇది నిజానికి టీడీపీ సంప్రదాయాలకి, చంద్రబాబు స్టైల్ కి భిన్నం! బాబు తన అపార అనుభవం, ఆచితూచి వ్యవహరించే నైజం వల్ల ఎప్పుడూ ఇలాంటివి చేయరు. కానీ, యువ నేత లోకేష్ దూకుడుగా ఇటు మోహన్ రెడ్డిని, అటు బుట్టూ రేణుకని టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు.దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. తండ్రితో మాట్లాడకుండా లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించేంత నిర్ణయం చేయరనే అనుకోవాలి. అయితే, ఇందులో అసలు గుర్తించాల్సిన విషయం… రానున్న కాలంలో చినబాబు పోషించబోయే పాత్ర!

ఒక బహిరంగ సభలో ఇద్దరు నేతల పేర్లు లోకేష్ పేర్కొనటం పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే, టీడీపీలో చంద్రబాబు కాకుండా ఇలా అభ్యర్థుల్ని మరొకరు ప్రకటించటం అస్సలు ఊహించలేం. కానీ, లోకేష్ బాబు ఇలా ఎందుకు చేసుంటారు? ప్లాన్డ్ గానే ఇదంతా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీ రోల్ చినబాబుదేనని వారంటున్నారు. ఆయన సీఎం అభ్యర్థిగా వుంటారా ? లేదా? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే … పార్టీ పరంగా మాత్రం రానున్న రోజుల్లో లోకేష్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టవచ్చు. ములాయం అఖిలేష్ ని, సోనియా రాహుల్ ని రంగంలోకి దించేసినట్టే చంద్రబాబు కూడా ఫుల్ టైం రెస్పాన్సిబిలిటి లోకేష్ భుజాలపైన పెట్టవచ్చు!

ఇక మరికొందరు రాజకీయ పండితులైతే మరో అడుగు ముందుకేసి… దిల్లీ రాజకీయాలు మోదీకి వ్యతిరేకంగా మారితే… ఖచ్చితంగా చంద్రబాబు అక్కడ వుండాల్సి వస్తుంది. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా బాబు పాత్ర ముఖ్యంగానే వుండబోతోంది. ఆయనే ప్రధాని అవ్వటం మొదలు కూటమిని ఒక్క తాటిపై నడిపే వరకూ ఆయన ఏ బాద్యతలైనా చేపట్టాల్సి రావచ్చు. అందుకే, దేశ రాజధానిలో తన మున్ముందు ఎజెండాను దృష్టిలో పెట్టుకనే బాబు లోకేష్ ను యాక్టివేట్ చేశారంటున్నారు. వారి ఉద్దేశ్యమైతే… దేశరాజధానికి బాబు, అమరావతిలో చినబాబు అని! చూడాలి మరి… లోకేష్ దూకుడు ముందు ముందు ఎలా వుండబోతోందో!