లోకేశ్ అమెరికా పర్యటన ఫలితం.. 1000 గ్రామాలు దత్తత

 

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి మే 3వ తేదీ నుండి అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయన పలు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఇందులో భాగంగానే ఆయన న్యూజెర్సీ లోని ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నైరైలు పాల్గొని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాలన్నింటిని అమెరికా శాసిస్తుంటే అమెరికా అమెరికాను ఇక్కడున్న తెలుగువారు శాసిస్తున్నారని, అమెరికాలో ఉన్న అత్యుత్తమ పది కంపెనీల్లో పది పోస్టులలో తెలుగువారు ఉన్నారని కొనియాడారు. నారా లోకేశ్ ప్రసంగానికి ముగ్దులైన ఎన్నారైలు అప్పటికప్పుడు 780 గ్రామాలను దత్తత తీసుకున్నారని, మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మీడియా ఛైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్ తెలిపారు.