ప్రత్యర్ధి పార్టీలపై లోకేష్ నిశిత విమర్శలు

 

ట్వీట్ వీరుడు నారా లోకేష్ అప్పుడప్పుడు జనాల మధ్యకు కూడా వచ్చిహడావుడి చేస్తుంటారు. నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీఎన్ఎస్ఎఫ్ వర్కుషాపులో పాల్గొన్నఆయన తమ రాజకీయ ప్రత్యర్దులయిన కాంగ్రెస్, వైకాపా, తెరాసలపై సునిశితమయిన విమర్శలు చేసారు. నిత్యం తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే వైకాపా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, “తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో చంద్రబాబు చొరవ వల్ల రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు తరలి వచ్చిఎనలేని సంపదను సృష్టిస్తే, ఆ తరువాత వచ్చిన వైయస్సార్ ప్రభుత్వం వెనుకుండి కధంతా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ధాటికి కొత్తగా ఒక్క ఐటీ కంపీనీ కూడా రాష్ట్రానికి రావడానికి భయపడ్డాయని, వైయస్స్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఫ్యాబ్ సిటీలు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేకపోయినా, అనేకమంది అధికారులను, మంత్రులను వ్యాపారవేత్తలను కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాయని లోకేష్ ఎద్దేవా చేసారు. వైయస్స్ మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు వల్ల కూడా ప్రజలకు ఎటువంటి లాభం కలగకపోయినా, అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నివిధాల లాభపడ్డారని ఆరోపించారు.

 

జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.

 

తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు.

 

తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేసారు. తెదేపా-కాంగ్రెస్-వైయస్సార్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై తెదేపా చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు.

 

సమావేశంలో పాల్గొన్న యువత నుద్దేశించి మాట్లాడుతూ అవినీతిపరుడయిన జగన్ కావాలో, లేకపోతే డిల్లీ నుండి పిలుపు రాగానే చేతులు కట్టుకొని పరుగులుపెట్టే కాంగ్రెస్ నేతలు కావాలో లేకపోతే తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్దికి కృషి చేసే తెదేపా కావాలో మీరే నిర్ణయించుకోండని సలహా ఇచ్చారు.