బాబునే కాదు… బాలయ్య బాబునీ టార్గెట్ చేస్తోన్న వైసీపీ! లాభమా? నష్టమా?

 

నంద్యాల సంగ్రామం భారీ యుద్ధంగానే పరిణమించింది! ఏదో సాదాసీదా ఉప ఎన్నికగా ముగుస్తుందనుకున్న పోరు కాస్తా ఇప్పుడు సాధారణ ఎన్నికల రేంజ్లో కాక రేపుతోంది! అయితే, ఇందుకు కారణం టీడీపీనా? వైసీపీనా? రెండూ అనే చెప్పాలి! అధికార పక్షం ప్రిస్టేజ్ గా తీసుకుంటే… ప్రతిపక్షం రానున్న ఎలక్షన్స్ కి ప్రిపరేషన్ గా తీసుకుంటోంది! అందుకే, కేవలం ఒకే ఒక్క సీటు కోసం ఓ భారీ యుద్ధమే కొనసాగిస్తున్నారు బాబు, జగన్ వర్గంలోని వారంతా!

 

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ దాడుల సెగ బాలయ్య బాబుకి కూడా తప్పటం లేదు. ఇన్ని రోజులు చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ మద్దతుదారులు తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబును ఆడిపోసుకుంటున్నారు. వారు వైరల్ చేస్తోన్న వీడియో బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టింది! ఆయన ఎందుకు అసహనానికి గురయ్యారు? అలా ఎవరో ఒక ఫ్యాన్ మీద చేయి చేసుకుంటే హిందూపురం ఎమ్మెల్యేకి వచ్చే లాభం ఏంటి? ఇలాంటివేవీ ఆలోచించకుండా బాలయ్య దురుసు ప్రవర్తన అంటూ వైసీపీ అల్లరి చేస్తోంది! అంతే కాదు, ఫ్యాన్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, బాలకృష్ణ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేశారు! ఆయన కోపమొస్తే ఎవర్ని పడితే వార్ని కొడతారంటు ఎద్దేవ చేశారు!

 

బాలకృష్ణ నంద్యాల ప్రచారంలో వైసీపీని రాజకీయంగానే టార్గెట్ చేశారు. ఆయన జగన్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమని మాత్రమే అన్నారు. ఎక్కడా ఎవర్నీ పర్సనల్ గా విమర్శించలేదు. అయినా, వైసీపీ వారు ఆయన ఓ వ్యక్తిపై చేయి చేసుకుంటే దాన్ని గురించి రాద్ధాంతం చేస్తున్నారు. కనీసం అలా జరగటానికి కారణం కూడా చెప్పకుండా విచ్చలవిడి కామెంట్లు, షేరింగ్ లకు తెగబడుతున్నారు. కాని, జనం ఓటు వేయటానికి బూతుకి వచ్చేటప్పుడు సోషల్ మీడియా హంగామాలు ప్రభావం చూపుతాయా? అదీ బాలకృష్ణ లాంటి ఓ ఇమేజ్ వున్న అగ్ర నటుడు, నందమూరి తారకరామారావు కొడుకు…. ఆయన పై జనం ఓ వైరల్ వీడియో చూసి సీరియస్ అయిపోతారా? ఇది వైసీపీ ఆలోచించుకోవాలి! రాజకీయ నాయకుల్ని పర్సనల్ గా టార్గెట్ చేయటమే తప్పు… అటువంటిది సినీ గ్లామర్ , కోట్లాది మంది అభిమానులున్న బాలకృష్ణ లాంటి హీరో వ్యక్తిత్వాన్ని కించపరటం మరింత తప్పు. దీని వల్ల పెద్దగా లాభం వస్తుందనైతే ఆశించటం దండగ! ఇప్పటికే జగన్ చంద్రబాబుని, రోజా మంత్రి అఖిలప్రియని పర్సనల్ గా టార్గెట్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణను కూడా వైసీపీ వారు వ్యక్తిగత దూషణలతో టార్గెట్ చేస్తున్నారు. దీని ఫలితం ఎన్నికల కౌంటింగ్ నాడు మాత్రమే తెలుస్తుంది!

 

ఒకవైపు జగన్ శిబిరం వ్యక్తిగత దాడులతో రచ్చ చేస్తుంటే… జగన్ పుట్టక ముందు నుంచే పాలిటిక్స్ లో వున్న చంద్రబాబు తన అనుభవంతో కూల్ గా పని చేసుకుపోతున్నారు. కర్నూల్ లో బలమైన నేతగా వున్న వైసీపీ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలోకి ఆకర్షించగలిగారు! శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రఫాణి రెడ్డీల్ని తమ వైపుకు లాగిన వైసీపీకి ఇది నిజంగా నష్టమే! గంగుల ప్రతాప్ రెడ్డి మద్దతు దారులు కర్నూల్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో వుంటారు. వారి ప్రభావం కేవలం నంద్యాల ఉప ఎన్నికకే కాదు రానున్న సాధారణ ఎన్నికపై కూడా తప్పక పడుతుంది!