లైమ్ లైట్‌లో ఉండటానికి రఘువీరా పాట్లు..!

ఆంధ్రప్రదేశ్ విభజన పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరమైన రాజకీయ తప్పిదం కారణంగా అక్కడి ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేశారు. ఆ దెబ్బతో దశాబ్దాల పాటు ఏపీని ఏకఛత్రాధిపత్యం కింద ఏలిన పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటుగానీ, లోక్‌సభ సీటు గానీ దక్కలేదు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీని పట్టించుకునేవారు లేరు. మిగిలిన చిన్నా, పెద్ద నేతలంతా టీడీపీ, వైసీపీలో చేరిపోగా..అక్కడక్కడ అంటిపెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు రావడంతో హస్తం మనుగడ కష్టంగా మారింది. మీడియా అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు కవరేజీ ఇవ్వడం కూడా తగ్గించేసింది. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరని అడిగినా..ఇంకా ఆ పార్టీలో లీడర్లు ఉన్నారా అని జనం అడిగే పరిస్థితి.

 

రాహుల్ వచ్చినా..భవిష్యత్తులో సోనియమ్మ వచ్చినా ఆ సభల్లో కుర్చీలు ఖాళీగా ఉంటాయి తప్ప అక్కడ జనం మాత్రం ఉండరన్నది వాస్తవం. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ పోటీ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్యేనని అందరికీ తెలుసు. అయినా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. అబ్దుల్ ఖాదర్ ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. గెలుస్తామన్న ఆశతో కాదు..కనీసం అలా అయినా జనానికి గుర్తు ఉంటామన్న తపనతో. ఇక ఆ పార్టీకి ఉన్న ఏకైక స్టార్ క్యాంపెయినర్ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒక్కరే. అడపా, దడపా ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అవాకులు, చవాకులు పేలుతూ ఉంటారు రఘువీరా.

 

ఉప ఎన్నిక ప్రచారంలో నేతల స్పీడు చూశారో లేక తాను వారిలా మాట్లాడాలని అనుకున్నారో ఏమో కానీ ఏకంగా నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారాయన. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని..ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేయడంతో పాలన పడక వేసిందని.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కుల దూషణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నా సీఎం స్పందించడం లేదన్నారు. ఈసీ గనుక సక్రమంగా విధులు నిర్వర్తిస్తే నంద్యాలలో ఏం జరుగుతుందో తెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. బహుశా తన వ్యాఖ్యలకు ఎవరో ఒకరు స్పందిస్తారని..అలా అయినా జనం దృష్టిలో పడొచ్చని రఘువీరా ఆశ కాబోలు.