నంద్యాల బరికి పార్టీల ఖర్చు ఎంత..?

ఎన్నికల్లో ఎంత మంచి అభ్యర్థి పోటీలో ఉన్నా..అతనికి ఎంత బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా లాభం లేదు..ఎందుకంటే ఇండియాలో డబ్బు ఖర్చు పెట్టనిదే ఎన్నికల్లో గెలవలేరన్నది జగమెరిగిన సత్యం. ప్రచారాన్ని పరుగులు పెట్టించాలన్నా..ఓటర్లను ఆకట్టుకోవాలన్నా డబ్బుదే కీలకపాత్ర.. రోజుల తరబడి ప్రచారం చేసినా ఆఖరి రోజున డబ్బులు పంచితేనే రాజకీయ పార్టీలు తమ పని అయినట్లు భావిస్తాయట. డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం నుంచి స్వచ్చంద సంస్థల వరకు ఎంతగా అవగాహన కల్పించినా.. ఓటర్లు తీసుకుంటున్నారు కాబట్టి మేం ఇస్తున్నామని పొలిటీకల్ పార్టీలు, వాళ్లు ఇస్తున్నారు కాబట్టి, మేం తీసుకోవడంలో తప్పేముంది అని జనం చెబుతూ ఉండటం గత కొన్నాళ్లుగా చెప్తున్న మాట.

 

దేశంలో అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరిగినట్లే ఎన్నికలకు కూడా ఖర్చు పెరిగిందని సర్వేలు రుజువు చేస్తున్నాయి. తప్పు కానీ ఒప్పు కానీ డబ్బు ప్రవహించకుండా ఎన్నికల పండగ అసాధ్యం. ఏ ఎన్నికలు వచ్చినా సరే వాటిలో తెలుగు రాష్ట్రాలే తీరే వేరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అక్రమంగా పట్టుబడ్డ 283 కోట్ల డబ్బులో 152 కోట్లు తెలుగు రాష్ట్రాలకు చెందినవే. సీజ్ చేసిన 130 లక్షల లీటర్ల మద్యంలో ఐదున్నర లక్షల లీటర్లు మన తెలుగు సోదరులను మత్తులో ముంచడానికి సరఫరా చేసిందే.

 

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా డబ్బు, మద్యం ఏరులై పారుతుందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు నంద్యాల సీటు కోసం 100 కోట్లను ఖర్చు చేయబోతున్నాయట. ఎందుకంటే ఈ ఉప ఎన్నికకు ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. అయితే నంద్యాల ఉప ఎన్నికలో ధనవ్యయం విపరీతంగా జరిగే అవకాశం ఉందని..దీనికి అడ్డుకట్ట వేయాల్సిందిగా కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో వేచి చూడాలి.