నంద్యాలలో వైసీపీని కొట్టడానికి టీడీపీ ప్లాన్ ఇదే..?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు పక్క రాష్ట్రాల చూపు కూడా నంద్యాలపైనే.  ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్న భూమా నాగిరెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాంప్రదాయం ప్రకారం అయితే టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సింది. కానీ భూమా నాగిరెడ్డి తమ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశంలోకి వెళ్లాడు కాబట్టి ఈ స్థానం తమకే చెందుతుందని చెప్పి పోటీకి రెడీ అయ్యింది వైఎస్సార్ కాంగ్రెస్. తమ పనితీరును బేరీజు వేసుకునేందుకు..జనం తమ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పాలక, ప్రతిపక్షాలు రెండు నంద్యాల ఉప ఎన్నికను కొలమానంగా తీసుకున్నాయి. దీంతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

 

టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగి శ్రేణులను ఉత్సాహపరుస్తుండగా.. సైకిల్ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు..రేపో మాపో సినీ గ్లామర్ కూడా తోడుకానుంది. ప్రస్తుతానికి అందిన అన్ని సర్వేల సమాచారం మేరకు వైసీపీకే విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోవడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోందట.

 

గత ఎన్నికల్లో వైసీపీకి ఎక్కడ ఓట్టు పడ్డాయి..మనకు ఎక్కడ పడలేదు అన్న దానిపై టీడీపీ అధినాయకత్వం విశ్లేషిస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏరియాల వారీగా కార్యకర్తలను మోహరించింది. ప్రాంతాల సమస్యలు, వర్గాల వారీగా అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టి పెట్టింది. అలాగే కీలకమైన బలిజ ఓట్లను పొందడానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మద్దతు కూడగట్టేందుకు రాయబారం నడుపుతోంది టీడీపీ.. దీనిపై నేడో, రేపో తేలిపోనుంది. అన్నింటికి తోడు అధికారం చేతిలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఇలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు సమన్వయంతో ముందుకు సాగుతోంది సైకిల్..మరి కొద్ది రోజుల్లో స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి రానుండటంతో నంద్యాలలో పొలిటీకల్ సీన్ మొత్తం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.