బాలయ్య, పవన్ రంగంలోకి దిగితే జగన్ తట్టుకోగలరా..?

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు ఎవరి స్టామినా ఏంటో..మూడేళ్ల టీడీపీ పాలనపై ప్రజల మనసులో ఏముందో..ప్రతిపక్షంపై అసలు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సర్వేలతో అయ్యే పనికాదు. అందుకే నంద్యాలపై పాలక, ప్రతిపక్షాలు అంతగా ఫోకస్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఓటు నిర్ణయాత్మకమే..అందుకే ఇరు పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులును నంద్యాలకు తరలించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇరు వర్గాలు. వైసీపీ అధినేత జగన్ ప్రచార పర్వంలోకి దిగడంతో ప్రచారానికి ఊపు వచ్చింది. దీంతో తాము వెనుకబడ్డామని భావించారో ఏమో తెలియదు కానీ అపర చాణుక్యుడు చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు.

 

రాయలసీమ ప్రాంతంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ప్రచారంలోకి తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇక బాలయ్యకు తోడుగా జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని కూడా రంగంలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీకి మద్దతు ఇచ్చే విషయంపై పవన్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను మరింత పటిష్టం చేసుకునే దిశలో ముందుకు సాగుతున్నారు పవన్. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి మద్దతిస్తే జనసేనకు ప్లస్సా..? మైనస్సా  అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

 

ఈ మూడేళ్లలో ఉద్దానం కిడ్నీ బాధితులు , ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసినా మిత్రపక్షం నుంచి బయటికి రాలేదు. పలుసార్లు సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు వివరించారే తప్ప.. అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో నంద్యాల ఉప ఎన్నికకు పవన్ తమకే మద్దతు ప్రకటిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కనుక సైకిల్‌కే సై అంటే మాత్రం జగన్‌కు నష్టమే..2 లక్షల 9 వేల 612 మంది ఓటర్లు ఉన్న నంద్యాలలో బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా..పవర్ స్టార్ టీడీపీ తరపున ప్రచారంలోకి దిగితే అది బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరో వైపు మెగా కుటుంబంతో భూమా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భూమా దంపతులు పీఆర్‌పీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2009లో ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు కూడా. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు తమకే ఉంటుందని మంత్రి భూమా అఖిల ప్రియ బలంగా విశ్వసిస్తున్నారు. నంద్యాలలో విజయం తమదేనని భావిస్తున్న వైసీపీ నేతలు పవన్, బాలయ్య ప్రచారంలోకి వస్తే వారిని తమ అధినేత ఏ విధంగా నిలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.