వైసీపీ వారి మాటల తూటాలు… టీడీపీ వారికే తగులుతున్నాయా?

  

అనౌన్స్ మెంట్ వచ్చింది. నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా అయిపోయింది. ఇక మిగిలింది యుద్ధమే! అవును… జరగాల్సింది బ్యాలెట్ వార్ కాదు రియల్ వారే! అంతలా ఉద్విగ్నంగా, ఉద్వేగంగా వున్నాయి నంద్యాలలో పరిస్థితులు! టీడీపీ, వైసీపీ రెండూ ల్యాండ్ మైన్ మీద కాలుపెట్టి నిలబడ్డాయి. పోలింగ్ పూర్తయ్యి ఫలితాలు వస్తే ఏదో ఒక పార్టీ నెత్తిన బాంబు పేలేలా వుంది. అయితే, అధికార టీడీపీది పరువు కోసం పోరైతే… వైసీపీది వచ్చే ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు తాపత్రయం. కాని, ఫ్యాను పార్టీ ఆ తొందరలో పదే పదే నోరు జారుతోందా? అవుననే అనిపిస్తోంది జగన్ శిబిరం అపరిపక్వ మాటలు వింటోంటే…

 

నంద్యాల నియోజక వర్గం సీటు ఎవరిది? భూమా నాగిరెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఆయన చేరాక అకాల మరణం పొందటంతో ఇప్పుడు టీడీపీ ఆ సీటు తమదేనని రంగంలోకి దిగింది. అటు వైసీపీ కూడా నంద్యాల తమదేనని భావిస్తోంది. ఈ కారణం చేతనే అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ తమ సర్వశక్తులూ ఒడ్డి నంద్యాల సంపాదించాలని చూస్తున్నారు. అయితే, తమ నేతకి మేలు చేయాలనే ఉత్సాహంలో మొట్ట మొదట నోరు జారింది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. ఆమె దివంగత భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియపై నోరు పారేసుకున్నారు. తల్లి మరణంతో ఎమ్మెల్యే, తండ్రి మరణంతో మంత్రి అయ్యావంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. అంతే కాదు, మరీ అభ్యంతరకరంగా అఖిలప్రియ చుడీదార్ వేసుకుని తిరుగుతారంటూ డ్రెస్సింగ్ ని కూడా టార్గెట్ చేసింది రోజా. ఒక మహిళా నాయకురాలి డ్రెస్సింగ్ గురించి మాట్లాడటం జనం మెచ్చుతారా? అదీ మరో మహిళ నేత అయిన రోజా, చుడీదార్ వేసుకోవటం సంస్కారవంతం కాదన్నట్టు మాట్లాడటం ఓట్లు సాధించి పెడుతుందా? కౌంటింగ్ నాడే తెలుస్తుంది!

 

వైసీపీ నాయకురాలు రోజా లాగే ఆ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తమకు రావాల్సిన మెజార్టీ గురించి మాట్లాడుతూ ఒక్క ఓటు తక్కువైనా మనం మగవాళ్లమే కాదంటూ, ఆడవాళ్లమన్నాడు! మగవాళ్లకంటే ఆడవాళ్లు తక్కువ అని చక్రపాణి రెడ్డి చెప్పకనే చెప్పారు! మరి మహిళా ఓటర్లు ఈ విధమైన ఆలోచనా ధోరణిని సహిస్తారా?

 

రోజా, చక్రపాణిరెడ్డి లాంటి ఇతర నాయకులు కాదు… ఏకంగా వైసీపీ బాస్ జగనే ఘోరంగా నోరు జారారు! చంద్రబాబును నడి రోడ్డు మీద నరికి చంపాలని ఆయన ఎందుకు అన్నాడో? ఏం ఆశించాడో? ఆయనకే తెలియాలి! పెద్ద రచ్చయ్యాక ఈసీకి వివరణ కూడా ఇచ్చుకున్నారు వైసీపీ అధ్యక్షులు!

 

ఒకవైపు వైసీపీ నుంచి వరుస వివాదాస్పద వ్యాఖ్యలు బయలుదేరుతున్నా టీడీపీ వారు జాగ్రత్తగా నోరు మెదుపుతున్నారు. నంద్యాల బరిలో గెలవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడా అతిగా మాట్లాడటం లేదు. చంద్రబాబు మొదలు ప్రతీ ఒక్కరూ వైసీపీ వారి ఓవర్ కామెంట్స్ ని క్యాష్ చేసుకునే పనిలో వున్నారు. అయితే, కౌంటింగ్ డే వచ్చే దాకా జగన్ వర్గం వారి మాటల ప్రభావం మనకు తెలియదు. రిజల్ట్స్ ఒకవేళ ఫ్యాన్ కి వ్యతిరేకంగా వస్తే… అందులో ఈ ఇష్టానుసారం మాట్లాడిన మాటల ప్రభావమూ ఖచ్చితంగా వుందనే భావించాలి!