నాగమన్నకు కోపమోచ్చే

 

తెలంగాణా జేయేసీని తన పెరట్లో తిరిగే కోడిగా భావించే తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ఆ విషయాన్నితన మనసులోఎన్నడూ దాచుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయనకు తగ్గటుగానే తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా, తెలంగాణా జేయేసీ అంటే తెరాస, తెరాస అంటే తెలంగాణా జేయేసీ అన్నట్లు, కేసీర్ ఆదేశానుసారం వ్యవహరించడం జరుగుతోంది. ఈ విషయంపై తెలంగాణా జేయేసీలో సభ్యపార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసాయి. అయినా కూడా, కేసీర్ ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరూ కూడా వాటిని పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు.

 

ఇక విషయానికి వస్తే, తెలంగాణ నగారా భేరీ నేత నాగం జనార్ధనరెడ్డి ఈ రోజు మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ, వారిరువురూ కూడా ఉద్యమం గురించి కాకుండా ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న తనను తెలంగాణా జేయేసీలోకి చేరనీయకుండా కేసీర్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. అసలు తెలంగాణా ఉద్యమాల గురించి, తెలంగాణలో జరుగుతున్నబలిదానాల గురించి ఆలోచించకుండా, వారిరువురూ ఎన్నికల గురింఛి ఎందుకు ఆలోచిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

 

అసలు నాగమన్నతనని తెలంగాణా జేయీసీలో జేరనివ్వనందుకు బాధపడుతున్నారా లేక వారిరువురూ ఉద్యమం పక్కదారి పట్టిస్తునందుకు బాధపడుతున్నారో తెలియదు గానీ,  (ఆ అక్కసుతో) ఆయన చేసిన ఆరోపణలతో తెలంగాణా జేయీసీ చేస్తున్న ఆలోచనలను మాత్రం బయటపెట్టారు.  

 

ఆయన ప్రశ్నలకు వారిరువురూ సమాధానం ఇస్తారో లేదో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ వదిలివచ్చి నాగమన్నకు ఇప్పుడు రెంటికీ చెడినందుకు బాధ మాత్రం మిగిలిపోయింది. పోనీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోదామనుకొన్నా, ఇప్పటికే ఆయన చంద్రబాబు విషయంలో చాలా సార్లు నోరు జారారు. ఒకవేళ సిగ్గువిడిచి వెనక్కు వెళ్ళినా అక్కడ ఇదివరకటి గౌరవం దక్కదని ఆయనకీ తెలుసు.

 

అసలు తెరాస తనకు ఎర్ర తివాచీ పరిచి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తుందనే ఆలోచనతోనో, లేక భ్రమతోనో తెలుగుదేశం పార్టీని విడిచి బయటకి వస్తే, తనను తెరాసలో చేర్చుకోకపోతే పాయె, కనీసం తెలంగాణా జేఈసీలోకూడా చేరనీయకుండా అడ్డుపడటం నాగమన్ననకు మింగుడు పడటం లేదు.  ఆయన ఎంత చమటోడ్చి నగారా మ్రోగించినా తెలంగాణాలో వినేవారేలేకుండా పోయారు.

 

ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఆయన ఏ పార్టీకి చెందని అభ్యర్ధిగా మిగిలిపోయారు. ఇక తెలంగాణాలో మిగిలిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణాకు ఎలాగూ అనుకూలమే గనుక, ఆపార్టీకి నాగమన్నవంటి గెలుపు గుర్రం అవసరం కూడా ఉంది గనుక, ఎన్నికల ప్రకటన వెలువడేలోగా నాగమన్న ఆ పార్టీలో తేలే అవకాశం ఉంది.ఇది కూడా ఉద్యమంలోనే భాగమే అని ఆయన అంటే ఎవరూ నవ్వకూడదు సుమా.