నాగంపై తెరాస ఎదురు దాడి, ఇతర పార్టీ నేతలకు కనువిప్పు

 

కేసీర్ మరియు ప్రొఫసర్ కోదండరాం తనను తెలంగాణా జేయేసీలోకి చేరనీయకుండా అడ్డుపడుతున్నారని, వారిరువురూ తెలంగాణా ఉద్యమాలను పక్కనపెట్టి వచ్చేఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశం గురించి మాట్లాడుతున్నారని, నాగం జనార్ధన్ రెడ్డి నిన్న తీవ్ర విమర్శలు చేశారు.

 

నిన్న గాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన మాజీ తెలంగాణా యన్.జీ.ఓ. నేత శ్రీనివాస్ గౌడ్ కు రాజకీయలలోను తెలంగాణా ఉద్యమాలలోనూ ఏమాత్రం అనుభవం, అవగాహన లేకపోయినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వోద్యోగుల మద్దతు పొందేందుకు అటు తెరాసలోకి, ఇటు తెలంగాణా జేయేసీలోకి సాదరంగా ఆహ్వానించి పెద్ద పీటవేసిన కేసీర్, సుదీర్గ రాజకీయ అనుభవం, తెలంగాణా ఉద్యమాల పట్ల పూర్తి అవగాహన, చిత్తశుద్ది ఉన్నతనను మాత్రం అంటరాని వాడినన్నట్లు దూరం ఉంచుతూ అవమానించడంతో నాగం ఆవేశంతో రగిలిపోతున్నారు.బహుశః అందువల్లే ఆయన కేసీర్, ప్రొఫసర్ కోదండరాంలపై ఈవిధంగా తీవ్ర విమర్శలు చేసి ఉండవచ్చును.

 

తమపై జనార్ధన రెడ్డి సందించిన నాగాస్త్రానికి తెరాస కూడా అంతే దీటయిన మరో అస్త్రంతో బదులిచ్చింది. ఆయన తెలంగాణా ఉద్యమంలో తెలుగు దేశం పార్టీ కోవర్టుగా పనిచేస్తునాడని తమకు తెలుసునని, అయినా ఉపేక్షిస్తున్నామని తెరాసకు చెందిన ఒక నాయకుడు అన్నారు.

 

కానీ, తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫసర్ కోదండరాం మాత్రం వేరే విధంగా స్పందించడం గమనార్హం. నాగం ఇంతవరకు తెలంగాణా జేయేసీలోసభ్యడు కాకపోయినప్పటికీ, ఆయనను తెలంగాణా జేయేసీలో జరిగే ప్రతీ సమావేశానికి కూడా తాము ఆహ్వానిస్తున్నామని, అయన కూడా వచ్చి పాల్గొంటున్నారని, తెలంగాణా జేయేసీలో అధికారికంగా సభ్యుడు కానంత మాత్రాన్న, అయనను దూరం పెట్టినట్లు భావించరాదని అన్నారు. త్వరలోనే ఆయనను తెలంగాణా జేయేసీలో సభ్యుడిగా తీసుకొనే అవకాశాలను పరిశీలిస్తామని ప్రొఫసర్ కోదండరాం అన్నారు.

 

ఇంతవరకు తానూ తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నానని భావిస్తున్ననాగం తెరాస చేసిన ఎదురు దాడితో కంగుతిన్నారు. తెలంగాణా ఉద్యమం కోసం తెలుగుదేశం పార్టీని విడిచి బయటకు వచ్చిన తనను తెరాస మెచ్చుకోకపోగా, ఇప్పుడు తెలంగాణాపై తన నిజాయితీనే ప్రశ్నించడంతో అది తెలంగాణాలో ఆయన ఉనికికి సవాలు విసిరినట్లయింది. దీనికి ఆయన ఏవిధంగా స్పందించినప్పటికీ, నాగం వ్యవహారంలో తెరాస వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణా నేతలను కనువిప్పు కల్పిస్తుందని చెప్పవచ్చును. తమను తెలంగాణా ఉద్యమం కోసం పార్టీలు వీడి బయటకి రావాలని డిమాండ్ చేస్తున్న తెరాస, ఒకవేళ నిజంగా బయటకి వస్తే వారికి ఎటువంటి దుస్తితి కల్పిస్తుందో కళ్ళకి కట్టినట్లు చూపించింది. తద్వారా, ఇక తెరాస ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఇతర పార్టీల నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు, యంపీలు తదితరులు పార్టీని వీడే దైర్యం చేయకపోవచ్చును.