నరేష్‌ని చూసి నేర్చుకోవాల్సిందే!

కష్టాలు ఒకోమనిషిని ఒకో తీరులో పలకరిస్తాయి. కొంతమంది ఆ కష్టాలకి కుంగిపోయి వాటినే నెమరేసుకుంటూ నిలబడిపోతారు. మరికొందరు మాత్రం అవి జీవితంలో మరో మార్గాన్ని చూపిస్తున్నాయన్న సూచనను అందుకుంటారు. అందుకనే వాళ్లు విజేతలుగా నిలిచిపోతారు. అలాంటి ఓ జీవితమే ‘నాగ నరేష్ కరుటుర’ అనే కుర్రవాడిది.

 


నాగనరేష్‌ది పశ్చిమగోదావరి జిల్లాలోని తీపర్రు అనే పల్లెటూరు. నరేష్‌ అందరిలాంటి కుర్రాడే. ఇంకామాట్లాడితే స్తోమతలో అందరికంటే చిన్నవాడు. అతని తండ్రి ఓ సాధారణ లారీ డ్రైవరు, తల్లి గృహిణి. చదువులో నరేష్ ఎప్పుడూ ముందే ఉండేవాడు. తీపర్రులో అలా ఆడుతూపాడుతూ చదువుతున్న నరేష్‌ ఓసారి అనుకోని ప్రమాదానికి లోనయ్యాడు. సంక్రాంతి పండగని ఊరికి వెళ్లే ప్రయత్నంలో, నరేష్‌ ఓ లారీ మీద నుంచి కిందపడిపోయాడు.

 


ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ... అదేమీ ప్రాణాంతకం కాదు! కానీ వైద్యుల నిర్లక్ష్యం మాత్రం అతనికి ప్రాణాంతకంగా మారింది. ప్రమాదంలో గాయపడిన నరేష్‌కు ఓ చిన్న బ్యాండేజీ కట్టి పంపేశారు వైద్యులు. ఆ గాయం లోలోపలే కుళ్లిపోయి చివరికి అతని రెండు కాళ్లనీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క పేదరికం, మరో పక్క వైకల్యం. ఇంకరైతే ఈ పరిస్థితికి క్రుంగిపోయేవారేమో! కానీ నరేష్‌ మాత్రం తనకి కాళ్లు లేవన్న కారణంతో వెనక్కి తగ్గకూడదని అనుకున్నాడు. దానికి తోడు నరేష్‌కు తగిన వైద్యం కోసమని తండ్రి తణుకు పట్నానికి మకాం మార్చాడు. తీపర్రులోనే ఉంటే నరేష్ చదువు పదోతరగతితోనే ఆగిపోయేది. కానీ తనకి కాళ్లు పోవడం వల్లే తణుకులోని మిషనరీ స్కూల్లో చదివే అవకాశం వచ్చిందంటాడు నరేష్‌.

 

తణుకులో చదువుకునే సమయంలోనే నరేష్‌కి ఉన్నత చదువులకి అవకాశం ఇచ్చే JEE పరీక్ష గురించి తెలిసింది. అంతే! తన దృష్టినంతా JEE ఎంట్రెన్స్‌ పరీక్షల మీద కేంద్రీకరించాడు. ఆ పరీక్షలలో జాతీయస్థాయిలోనే వికలాంగుల కోటాలో నాలుగో ర్యాంకుని సంపాదించాడు. దాంతోపాటే మద్రాసు ఐఐటీలో సీటునీ సంపాదించాడు. నరేష్‌ గురించి విన్న జయపూర్‌ హాస్పిటల్‌వాళ్లు అతని చదువుకి అయ్యే ఫీజులని భరించేందుకు సిద్ధపడ్డారు. మద్రాసు ఐఐటీలోని అతని సహవిద్యార్థులు నరేష్‌ కోసం ఓ బ్యాటరీ కుర్చీని కొనిపెట్టారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు నరేష్. ఐఐటీ కోర్సుని సమర్థంగా పూర్తిచేశాడు. గూగుల్‌ బెంగళూరు క్యాంపస్‌లో ఉద్యోగాన్ని సాధించాడు.

 

ఏం జరిగినా అంతా మన మంచికే అనీ, తన చుట్టూ ఉన్న మనుషులంతా మంచివారేననీ నరేష్‌ నమ్మకం. పరిస్థితులన్నీ అతని నమ్మకాన్ని బలపరిచేలాగానే సాగాయి. రైళ్లో అతనితో పాటు ప్రయాణించినవారు కూడా నరేష్ పట్టుదలని చూసి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమే మరి! మన దృక్పథం ఎలా ఉంటుందో... ప్రపంచం కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తుందన్నది పెద్దల మాట కదా. సాధించలేను అనుకుంటే ఎన్ని సులువులు చేతికందినా ముందుకు వెళ్లలేము. సాధించి తీరాలి అనుకుంటే ప్రతి అడుగూ అవకాశం దిశగానే పడుతుంది.

 

- నిర్జర.