మధ్యప్రదేశ్ లో గాడ్సే లైబ్రరి ! గాంధీకి అవమానమంటున్న కాంగ్రెస్ 

జాతిపిత  మహాత్మగాంధీని హత్య చేసిన  నాథూరామ్ గాడ్సే విషయంలో చాలా రోజులుగా దేశంలో వివాదం జరుగుతోంది. నాథూరామ్ గాడ్సేకు మద్దతుగా కొన్ని హిందూ సంస్థలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం దుమారం రేపుతోంది. తాజాగా బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో  నాథూరామ్ గాడ్సే పేరుతో ఒక లైబ్రరీ ఏర్పాటైంది. అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ లైబ్రరిని ఏర్పాటు చేసింది. ఇదే ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతోంది. మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సే పేరుతో  లైబ్రరీ ఏర్పాటు చేయడాన్ని  కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

 మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి రవీ సక్సేనా ఈ ఘటనలో బీజేపీని తప్పుపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సాధ్వి ప్రగ్యకు టిక్కెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 'బీజేపీకి ఇదేమీ కొత్త కాదు. పార్లమెంటులో గాంధీని అవమానించి, గాడ్సేను పొడిగిన 'గాడ్సే భక్తురాలు'కు భోపాల్‌ నుంచి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది' అని అన్నారు. గాంధీని చంపిన వ్యక్తిని ఆరాధిస్తున్నారంటే వారు హింసను ప్రోత్సహిస్తున్నట్టేనని, అలాంటి వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అయితే ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని, రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ చెబుతోంది. 

గ్వాలియర్‌లో  నాథూరామ్ గాడ్సే  లైబ్రరీ ఏర్పాటు చేయడంపై హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ స్పందించారు. దేశ విభజన కాలం నాటి విషయాలను, జాతీయ నేతల గురించి యువతరం తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. అప్పటి ఘటనల్లో వాస్తవాలు, దేశం పట్ల తమకున్న బాధ్యతలను యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే   లైబ్రరీని ప్రారంభించినట్టు తెలుస్తుందన్నారు.  దేశ విభజనకు నాథూరామ్ గాడ్సే ఎందుకు విభేదించాడు, దీనికి వ్యతిరేకంగా ఎందుకు గళం విప్పాడనే సమాచారం దేశ యువతకు తెలిపేందుకుకే  ఈ ప్రయత్నమని అఖిల భారతీయ హిందూ మహాసభ  క్లారిటీ ఇచ్చింది.