కులం, మతం ఓకే… ప్రతిభకి రిజర్వేషన్ వద్దా?

రిజర్వేషన్ …. ఈ పదం ఏ క్షణాన రాజ్యాంగంలో చేరిందోగాని… బలంగా పాతుకుపోయింది! ఆ మధ్య ఏదో ఊపులో ఆరెస్సెస్ వారు రిజర్వేషన్స్ పై పునః సమీక్ష జరగాలి అన్నారు. పూర్తిగా రద్దు చేయాలని కూడా వారు అనలేదు. అయినా ఆ వెంటనే బీహార్లో బీజేపి ఓటమితో ఇప్పుడు కమలదళం కూడా రిజర్వేషన్స్ విషయంలో రిజర్వర్డ్ గా వుంటోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నాలుగడుగులు ముందుకేసి నాలుగు శాతం వున్న ముస్లిమ్ రిజర్వేషన్స్ పన్నెండు శాతానికి పెంచారు! రిజర్వేషన్స్ చుట్టూ పెద్ద రాజకీయమే నడుపుతున్నారు!

 

రిజర్వేషన్స్ ఏ పార్టీకైనా కత్తి మీద సామే! ఏ ప్రాంతంలో అయినా ఒక్క సారి రాజుకుంటే ఆగే మంట కాదు రిజర్వేషన్స్ దావానలం! ఉత్తరాదిలో పాటీదార్లు, జాట్లు మొదలు మన తెలుగు ప్రాంతంలో కాపుల వరకూ రిజర్వేషన్స్ అనగానే అందరూ చాలా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా స్పందిస్తుంటారు. ఎక్కడ తేడా వచ్చినా ప్రభుత్వాల జాతకాలే మారిపోతుంటాయి. అందుకే, రిజర్వేషన్స్ తేనెతుట్టేలోంచి తమకు కావాల్సిన హనీ తీసుకుని నేతలు వాడుకుంటారుగాని… మొత్తానికి మొత్తంగా రిజర్వేషన్స్ తేనెతుట్టేను కదిలించే సాహసం చేయరు!

 

కేసీఆర్ చెబుతోన్న ముస్లిమ్ రిజర్వేషన్స్ మన నేతల పొలిటికల్ టాలెంట్ కి నిదర్శనం. ఇలాగే ముస్లిమ్ లకు విద్యా, ఉద్యోగాలంటూ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని కోర్టులో బోర్లాపడగా, మరికొన్ని నిర్ణయాలు కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే, ఇక్కడ మన వాళ్ల మాటలగారడీ మనం జాగ్రత్తగా గమనించాల్సి వుంటుంది. ముస్లిమ్ ల ముందుకి వెళ్లినప్పుడు తాము పెంచింది ముస్లిమ్ కోటా అని చెబుతాయి మన పార్టీలు. కాని, అదే కోటా గురించి కోర్టు అడిగితే మాత్రం బీసీ కోటాలో మార్పులు మాత్రమే చేశామంటుంటారు పాలకులు! ఇది తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో జరుగుతూ వస్తోంది. కోర్టు మత ప్రాతిపదిక ఒప్పుకోదు కాబట్టి ముస్లిమ్ లలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కోటాలో ఇస్తున్నామంటారు. కాని, అదే విషయం ప్రజల ముందు చెప్పరు. ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి రిజర్వేషన్స్ ఇవ్వటానికి, ముస్లిమ్ లకు రిజర్వేషన్స్ పెంచుతున్నామని చెప్పటానికి … చాలా తేడా వుంది! దాన్నే ఎదురుదాడితో బీజేపి క్యాష్ చేసుకుంటూ వుంటుంది!

 

ముస్లిమ్ లకి రిజర్వేషన్స్ పెంపు అంటే… దాదాపుగా ఏ లౌకిక పార్టీ నోరు మెదపదు. ఆ బలహీనతని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వుంటుంది కాషాయదళం. తెలంగాణ అసెంబ్లీలో కూడా బీజేపి నేత కిషన్ రెడ్డి నిర్ద్వద్వంగా ముస్లిమ్ రిజర్వేషన్స్ కి నో అన్నారు. అలా ఇతర పార్టీలు ఓటు బ్యాంక్ ఒత్తిళ్ల అనలేకపోవటమే బీజేపికి కలిసొచ్చే అంశం!

 

ఎన్నికల్లో రిజర్వేషన్స్ పెంపు అంశం ఎన్ని ఓట్లు ఎవరికి రాలుస్తుందనేది ఇప్పుడు తేలిది కాదు. కాని, అప్పటి వరకూ మాత్రం ఈ ముస్లిమ్ రిజర్వేషన్ల గోల బీజేపి, టీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ పంచ్ లకు మంచి అవకాశం ఇస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ లకు చేటు చేస్తూ రెండూ పార్టీలకు లాభం చూకూర్చినా ఆశ్చర్యపోనవసరం లేదు! ఇక ప్రాక్టికల్ గా ముస్లిమ్ పేదలు రిజర్వేషన్ల ఫలితాలు చవి చూడాలంటే కోర్టులు, కేంద్రం అడ్డంకుల్ని దాటుకుని బిల్లు కార్యరూపం దాల్చాలి. దానికి కూడా బోలెడు సయమం పట్టే సూచనలే కనిపిస్తున్నాయి. కాని, అంతవరకూ కేసీఆర్ మాత్రం వీలైనంత మైలేజీ పొందే ఛాన్స్ వుంది. ఇప్పటికే ఏపీలో వున్న ముద్రగడ పద్మనాభం ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. రిజర్వేషన్స్ విషయంలో కేసీఆర్ అన్నమాట నిలబెట్టుకున్నారని మెచ్చుకున్నారు. పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేయటమే దీని ఉద్ధేశం! ఇలాంటి రిజర్వేషన్ రాజకీయాలు వచ్చే ఎన్నికల దాకా అందరికందరూ తమదైన రీతిలో చేస్తూ పోతారు!

 

రిజర్వేషన్స్ పెంపు, మతం ఆధారంగా రిజర్వేషన్స్ … ఇవన్నీ పైకి రాజకీయ ఎత్తుగడల్లా కనిపించినా… నిజమైన ఆర్దిక, సామాజిక వెనుకబాటుతనం వున్న వారికి ఉపయోగపడితే అదే పదివేలు! కాని, అలా జరుగుతున్నట్టు కనిపించటం లేదు. పైపెచ్చు… తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసినట్టు రిజర్వేషన్స్ 50 నుంచి 60 శాతం దాటిపోతే… పర్యవసానం ఏమైనట్టు? జనరల్ కోటాలో కోతపడ్డట్టు! జనరల్ క్యాటగిరి ఎవరిది? కేవలం ఓసీలదైతే కాదు. ప్రతిభ వున్న ప్రతీ సామాజిక వర్గానికి జనరల్ క్యాటగిరి అవశాలపై హక్కుంటుంది. అటువంటి ప్రతిభకి పట్టం కట్టే జనరల్ కోటాలో కోత విధించటం అంటే దేశాభివృద్ధిపై ప్రభావం చూపటమే! ప్రతిభ వున్న వారిని రిజర్వేషన్స్ ,రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా దేశం కోసం ఉపయోగించుకోవటం జాతి బాధ్యత! దాన్ని మరిచి జనరల్ క్యాటగిరిలో కోతలు పెట్టటం నిజంగా పెద్ద విషాదం…