చిత్తూరు జిల్లాలో దారుణం.. భూమి కోసం గిరిజన యువకుడి హత్య

భూదాహానికి ఆంధ్రప్రదేశ్ లో దళితులు, గిరిజనులు బలైపోతూనే ఉన్నారు. అప్పు తీర్చలేదంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు గిరిజన మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు. భూమి కోసం డబ్బా బాబ్లీ(36) అనే గిరిజన యువకుడుని పొట్టన పెట్టుకున్నారు.

 

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే, చింతలపాళేనికి చెందిన కొంతమంది ఆ 560 ఎకరాల భూమిని కాజేసి పట్టాలు సంపాదించారు. దీంతో 2006 నుంచి షికారీలు తమ భూమి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నెల 7న షికారీలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుడిసెలు వేశారు. దీన్ని సహించలేని అగ్రకులాల వారు దాడి చేయడంతో 23 మంది షికారీలు గాయపడ్డారు. అంతటితో వాళ్ళు ఆగలేదు. భూ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న డబ్బా బాబ్లీని లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం రాత్రి బాబ్లీని దుండగులు హతమార్చి నీటి గుంతలో పడేశారు. బాబ్లీ సోదరుడు పరుశురామ్‌ ఫిర్యాదు మేరకు దాదాపు 30మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో అధికార పార్టీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ రమణయ్యయాదవ్‌ ను ప్రథమ నిందితుడిగా పేర్కొన్నారు.

కాగా, టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. "భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

"మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారు. గిరిజన యువకుడు డబ్బా బాబ్లీ ని అత్యంత కిరాతకంగా హత్యచేసారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు." అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

"అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయ్యాలి. డబ్బా బాబ్లీ ని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.