తెరాసలో నిరసన సెగ.. బాల్క సుమన్‌ పై హత్యాయత్నం?

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో తెరాసకు నిరసన సెగ తగిలింది.. తెరాస ఇటీవల ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో, చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే దీన్ని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు.. తనకు చెన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఆయన స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.. దీంతో ఓదేలు వర్గం బాల్క సుమన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.

 

 

ఈ నేపథ్యంలో బుధవారం నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వచ్చిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు.. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా గాయాలపాలయ్యారు.. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు.. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారని సుమన్ ఆరోపించారు.. తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారనీ, అయితే గన్ మెన్లు, తన మద్దతుదారులు వారిని అడ్డుకుని తనకు రక్షణగా నిలిచారని అన్నారు.. ఓదేలు వర్గం ఎన్ని కుట్రలు చేసినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదన్నారు.. ఇది కేసీఆర్‌ నిర్ణయమని, ఆయన శిష్యుడిగా ఆ నిర్ణయాన్ని పాటించడమే తన విధి అని బాల్క సుమన్‌ తేల్చిచెప్పారు.