సార్వత్రిక ఎన్నికలపై మునిసిపల్ ప్రభావం?

 

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సార్వత్రిక ఎన్నికలకు ముందు వరుసపెట్టి మున్సిపల్ ఎన్నికలు, యంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇవి ఎన్నికల అధికారులపై, ప్రభుత్వ, పోలీసు వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి ఏర్పరచడమే కాక, ప్రజలకు, రాజకీయపార్టీలకు కూడా ఇబ్బందికరంగా మారాయి. కానీ కోర్టు కొరడా జళిపించడంతో తప్పనిసరిగా వరుసపెట్టి ఎన్నికలు నిర్వహించవలసి పరిస్థితి ఏర్పడింది. మొన్న మునిసిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహన పూర్తయింది. తరువాత మరొక పదిరోజుల్లో యంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. మరో పదిహేను రోజుల తరువాత మొదట తెలంగాణాలో (ఏప్రిల్ 30న), మళ్ళీ వారం రోజుల తరువాత (మే7న) ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.

 

ఎన్నికల కమీషన్ వరుసపెట్టి ఇన్ని ఎన్నికలను నిర్వహించడం కష్ట సాధ్యమే అయినా, నిర్వహించేందుకు సంసిద్దంగా ఉంది. కానీ, మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరుగబోయే యంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వెలువరచినట్లయితే ఆ ప్రభావం తరువాత జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై కూడా పడుతుందని, అందువల్ల ఫలితాలు వెలువరచకుండా నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు ఈరోజు విచారణ చేప్పట్టడంతో వాదనలు కొనసాగుతున్నాయి.

 

ఒకవేళ పిటిషన్లను హైకోర్టు గనుక కొట్టివేస్తే, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడవచ్చు గనుక అవి ఓటర్ల నాడిని కొంతవరకు పట్టి ఈయవచ్చును. దానిని బట్టి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలున్నాయో చూచాయగా తెలియవచ్చును. దానివలన సదరు పార్టీ సమరోత్సాహంతో ఎన్నికలలో దూసుకుపోతే, మిగిలిన పార్టీలు మేకపోతు గాంభీర్యం నటిస్తూ ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. బహుశః మధ్యాహ్నం తరువాత కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది.