ఇంటర్వెల్లో ‘సినిమా’ చూపిస్తున్న హాళ్లు

 

సూరిబాబు కుటుంబంతో సహా ‘భరత్‌ అనే నేను’ సినిమా చూద్దమనుకున్నాడు. హాయిగా ఇంటర్వెల్లో ఏదో ఒకటి తిందామనుకుంటే... బయటి ఆహారం ఏదీ లోపలకి తీసుకువెళ్లకూడదని చెప్పారు. దాంతో హాల్లోనే ఏదో ఒకటి కొనుక్కోవచ్చులే అనుకున్నాడు. దాంతో సూరిబాబు అడ్డంగా బుక్కైపోయాడు. సమోసా 20 రూపాయలు, కూల్‌డ్రింక్‌ 30 రూపాయలు చొప్పున కొనుక్కునేందుకు అతని జేబుకి చిల్లు పడిపోయింది.

ఒక్క క్షణం ఇక్కడో చిన్న లెక్క వేసుకుని చూద్దాం. సినిమా హిట్‌ అయితే హాల్లో జనాలు బాగా నిండుతారు. ఒకో షోకి కనీసం 100 సమోసాలు అమ్ముడుపోతాయి. హోల్‌సేల్‌లో ఏడు రూపాయలకి వచ్చే సమోసాని కనీసం 20 రూపాయలకి అమ్మడం వల్ల షోకి 1300 రూపాయల లాభమన్నమాట. అంటే రోజుకి నాలుగు షోలకీ కలిపి 5200 రూ.ల లాభం- నెలకి ఏకంగా లక్షన్నర ఆదాయం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకి కూడా రాని సంపాదన, హాల్లో గంట పనిచేస్తే వచ్చేస్తుంది కదూ! మరి ఇంత దర్జాగా దోచుకుంటున్న వ్యక్తుల మీద చర్యలేవీ అంటే నామమాత్రమే!

ఈ పరిస్థితి అక్కడా ఇక్కడా అని కాదు... బహుశా దేశం అంతటా ఉండే ఉంటుంది. చిన్న చిన్న పట్నాలలో ఉండే హాళ్లలో కూడా యథేచ్చగా దోపిడీ సాగుతుంటోంది. ప్రభుత్వాధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటారు. ఒకవేళ ఏదన్నా చర్య తీసుకోవాలన్నా తూనికలు, కొలతలు; శానిటరీ అధికారుల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. చర్యలు తీసుకున్నా కూడా అవి ఎక్కువగా జరిమానాలకే పరిమితం అవుతూ ఉంటాయి. జరిమానా కట్టేసి, ఓ వారం రోజులు గమ్మున ఉండి... తిరిగి ప్రేక్షకులని దోచుకోవచ్చు. మహా అయితే హాల్లో అమ్ముకునే కాంట్రాక్టరు మారతాడు. దోపిడీ యథావిధిగా సాగుతుంది.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవల్సి వస్తోందంటే... తూనికలు, కొలతల శాఖ నిన్న హైదరాబాదులోని 15 మల్టీప్లెక్సుల్లో తనిఖీలు నిర్వహించి 105 కేసులు నమోదు చేశాయి. ఈ వార్త చదువుకోవడానికి కాస్తా బాగానే ఉంది. హాళ్ల పాపం పండిందని వినియోగదారుడు కాసేపు సంతోషపడొచ్చు కూడా! కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమే అన్న చేదు నిజాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కోర్టులకి జరిమానా కట్టి, ఆ జరిమానాలని తిరిగి కస్టమర్ల మీద దండుకుంటారు కాబట్టి... ఆ శిక్ష ప్రేక్షకులకి విధించినట్లుగానే అర్థం చేసుకోవాలి.

ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జరిమానాలను భయపడే స్థాయిలో విధించాలి. తప్పు జరుగుతున్న హాళ్లను సీజ్ చేయాలి. కఠిన చర్యలు తీసుకోనంత వరకూ సినిమాహాళ్ల దోపిడీ ఆగుతుందని ఆశించలేం. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇది కేవలం సమోసాలకీ, పాప్‌కార్న్‌లకీ సంబంధించిన విషయం కాదు. మన సమాజంలో దోపిడీ ఎంత యథేచ్ఛగా జరిగే అవకాశం ఉందో తెలిపే ఉదాహరణ కూడా! నోరెత్తి అడగాల్సిన ప్రజలు మనకెందుకులే అని నోరు మూసుకుంటారు. ప్రజల తరఫున పని చేయాల్సిన అధికారులు లంచాలకో, అలసత్వానికో బానిసైపోతారు. అధికారుల పనితీరు గమనించుకోవాల్సిన ప్రభుత్వం స్కీములతోను, స్కాములతోనూ బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యవస్థలోని అణువణువూ ఇంతే లోపభూయిష్టంగా ఉంటుంది.