రాజకీయాల్లోకి శ్రీకృష్ణుడు

భారతీయులను సులభంగా బుట్టలో వేసుకునే మార్గం ఏదన్నా ఉందంటే అది సెంటిమెంటే అంటారు పాశ్చాత్యులు. ఇండియాలో దానికున్న పవర్ దేనికీ లేదని వారి స్ట్రాంగ్ ఫిలింగ్. వారు ఆ మాట ఎందుకన్నారో తెలియదు కానీ అది మాత్రం పచ్చి నిజం. మనదేశంలో అన్ని రకాల పనులు చేసుకునేందుకు ఈ సెంటిమెంట్‌నే ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు. ఈ విషయంలో పొలిటిషియన్స్‌ది అందెవేసిన చేయి. వారి అంతిమ లక్ష్యం ఏదైనా ఉందంటే అది అధికారమే.. దాని కోసం వారు ఏం చేయడానికైనా సిద్ధమే.. వివాదాలను వారే రాజేస్తారు.. దానిపై పోరాటాలు చేస్తారు.. వాటిని చల్లారుస్తారు.. జనం దృష్టిలో హీరోలవుతారు.

 

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తమ స్వార్థం కోసం లేనిపోని వివాదాలను సృష్టించి ప్రజల్లో సెంటిమెంట్‌ని రగిల్చి ప్రయోజనం పొందిన వారు ఎందరో. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి ఘోరంగా దెబ్బతిన్న సమాజ్‌వాదీ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడానికి కొత్త రాగాన్ని అందుకుంది. ఆ పార్టీ మాజీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి శ్రీకృష్ణుడిని లాగి సరికొత్త వివాదాన్ని దేశ రాజకీయాల్లోకి తెరపైకి తెచ్చారు. శ్రీరాముడు కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే పూజలు అందుకుంటున్నాడని... అయితే శ్రీకృష్ణుడు మాత్రం మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడని వ్యాఖ్యానించారు.

 

ఘజియాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడికే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారని.. దక్షిణ భారతదేశం వెళితే.. శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడే ఎక్కువ పూజలు అందుకుంటున్నాడని గ్రహిస్తారన్నారు. ములాయం ఈ మాట అనడానికి వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. అయోధ్యలోని రామ మందిర వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్లింది. దాని నుంచి జనం దృష్టిని కొద్దిగా మళ్లించేందుకో.. మరేదైనా కారణం చేతనో గానీ.. పర్యాటకం పేరిట సరయు నదిపై 100 మీటర్ల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రామ మందిరం ఇష్యూ పక్కకి వెళితే రాజకీయంగా సమస్యలు వస్తాయని భావించిన కమలనాథులు శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని భుజానికెత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

రాముడి వైపు జనం వెళ్లిపోతే తమ పరిస్థితి క్లిష్టంగా మారుతుందని భావించిన ఎస్పీ కురువృద్ధుడు కృష్ణుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.. అయితే తన స్వగ్రామమైన సైఫైలో 50 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.  తమకు సాలీడ్ ఓటు బ్యాంకుగా ఉన్న యాదవుల్ని పట్టి ఉంచేందుకే అఖిలేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని లక్నో టాక్. కొడుకు విగ్రహాన్ని ప్రతిష్టాననడం.. తండ్రి శ్రీకృష్ణుడిని పొగడటం చూస్తుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల రాజకీయమంతా రాముడు, కృష్ణుడు చుట్టూనే తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.