కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో ముకేష్ అంబానీ

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ముఖ్యంగా రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ.. అంబానీకి లబ్ది చేకూరేలా వ్యవహరించారంటూ రాహుల్ పదేపదే చెప్తుంటారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ అంబానీపై విమర్శలు చేస్తుంటే.. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తన మద్దతు తెలిపి ఆశ్చర్యం కలిగిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తలు వరకు మిలింద్ దేవరాకు తమ మద్దతు తెలియజేశారు. మిలింద్ దేవరా ట్వీట్ చేసిన వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, కోటక్ మహీంద్ర గ్రూప్ యజమాని ఉదయ్ కోటక్ కూడా తమ మద్దతు తెలియజేశారు. వీడియో ట్వీట్ చేస్తూ మిలింద్ దేవరా దక్షిణ ముంబై అంటే బిజినెస్ అని రాశారు. దాంతో పాటే ప్రజలు నన్ను గెలిపిస్తే యువకులకు ఉద్యోగావకాశాలు తెస్తాను. యువతకు ఉద్యోగాలివ్వడం నా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ.. దక్షిణ ముంబైకి మిలింద్ దేవరా సరైన వ్యక్తి అన్నారు. అతను పదేళ్లుగా ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నాడని అంబానీ చెప్పారు. మిలింద్ కు అనేక అంశాలపై మంచి అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను.. అతను యువతకు ఉద్యోగావకాశాలు చూపగలడు అని అన్నారు.

ముకేష్ అంబానీ, మిలింద్ దేవరా కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. బహుశా ఇదే కారణంగా ముకేష్ అతని ప్రచార వీడియోలో కనిపించి ఉండొచ్చని తెలుస్తోంది.