ముద్రగడకు జగన్ బంపరాఫర్.. వైసీపీలో చేరగానే కీలక పదవి!!

 

కాపు ఉద్య‌మ నాయ‌క‌డు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలో చేర‌టం ఖాయ‌మైనట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ముద్ర‌గ‌డ‌ను వైసీపీలోకి ఆహ్వానించారని, ఆయ‌న పార్టీలో చేరిన వెంటనే ఓ పదవి కూడా ఇవ్వనున్నారని స‌మాచారం. కాపు కార్పోరేష‌న్‌కు ఏటా ప‌దివేల కోట్లు బ‌డ్జెట్ కేటాయిస్తామ‌ని జ‌గ‌న్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ముద్రగడ కోరుకుంటే కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌టానికి సిద్దంగా ఉన్న‌ట్లు జ‌గ‌న్ హమీ ఇచ్చారట. భ‌విష్య‌త్‌లో రాజ్య‌స‌భ‌లో వైసీపీకి అవ‌కాశం వ‌స్తుంద‌ని.. ఆ స‌మ‌యంలో ముద్ర‌గ‌డ‌కు స్థానం క‌ల్పిస్తామ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ నుండి రాజ్య‌స‌భ‌లో ఉన్న ఇద్ద‌రూ ఒకే వ‌ర్గానికి చెందిన వారు కావ‌టంతో ముద్ర‌గ‌డ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారట. టీడీపీ, జ‌న‌సేనకు కాపు వ‌ర్గాన్ని పూర్తిగా దూరం చేసేందుకు, 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా జగన్ ఇటువంటి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపు వ‌ర్గం ఓట్లు కీల‌కం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. ప‌వ‌న్ కళ్యాణ్ జ‌న‌సేన పార్టీ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో గ‌ణ‌నీయ ప్ర‌భావం చూపుతుంద‌ని.. మెజార్టీ కాపు ఓటింగ్ జ‌న‌సేన‌కే వెళ్తుంద‌ని అంచ‌నా వేసారు. అదే స‌మ‌యంలో తాము కాపుల‌కు 5 శాతం రిజర్వేష‌న్లు ఇవ్వ‌టంతో పాటుగా ఆర్దికంగా తోడ్పాటు అందించామ‌ని త‌ప్ప‌కుండా వారంతా త‌మ‌తోనే ఉంటారు అని టీడీపీ ఆశించింది. అయితే, అనూహ్యంగా కాపు మెజార్టీ ఓటింగ్ వైసీపీకే అనుకూలంగా పడింది. అధిక నియోజ‌కవర్గాల్లో గెలుపొందింది. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్దుల గెలుపు కోసం ముద్ర‌గ‌డ పరోక్షంగా స‌హ‌క‌రించార‌ని.. ఆయ‌న వైసీపీ అభ్య‌ర్దుల‌కు మ‌ద్ద‌తుగా ఓట్లు వేయించార‌ని చెబుతున్నారు. దీంతో జగన్ బంపరాఫర్ ఇస్తూ ముద్ర‌గ‌డను పార్టీలోకి ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది.