ముద్దబంతిపూవులో ఆరోగ్యపు ఊసులు


సంక్రాంతి వస్తోందంటే చాలు... ఆ పండుగ హడావుడికి కొత్త రంగునీ రూపునీ ఇస్తాయి బంతిపూలు. గుమ్మాలకి తోరణాలు కట్టాలన్నా, ఎద్దులని అలంకరించాలన్నా, భోగిపండ్లు పోయాలన్నా, గొబ్బెమ్మల తల మీద అద్దాలన్నా... బంతిపూలతో సంక్రాంతి కొత్త శోభని సంతరించుకుంటుంది.

 

బంతిపూల వాడకం ఈమధ్యకాలంలో కాస్త ఎక్కువయిన మాట వాస్తవమే కానీ మన రైతులకి ఈ పూలు కొత్తేమీ కాదు. మరీ వేడిగానూ అలాగని మరీ చల్లగానూ ఉండని మన దేశ వాతావరణం ఈ బంతిపూలకి చాలా అనువుగా ఉంటుంది. అందుకనే పొలాల గట్ల మీద ఈ మొక్కలను తప్పకుండా నాటేవారు. వీటి వలన పొలంలోని పంటకీ పురుగూ పుట్రా ఆశించవని రైతుల నమ్మకం. బంతిపూలకి క్రిమికీటకాలు దూరంగా ఉంటాయి కాబట్టి ఈ నమ్మకంలో నిజం లేకపోలేదు.

 

బంతిపూలకి పెద్దగా వాసన ఉండదు. పైగా ఇవి బరువుగా కూడా ఉంటాయి. బహుశా ఈ కారణాల చేత వాటిని పూజకి వాడం. కానీ అలంకారం కోసమూ, ఆరోగ్యరీత్యా వీటిని ప్రతి సందర్భంలోనూ వినియోగిస్తూనే ఉంటాము. బంతిపూలని ఆంగ్లంలో మేరీగోల్డ్ అంటారు. ఇక దీని శాస్త్రీయ నామమేమో Calendula officinalis. బంతిపూలు తినేందుకు ఏమంత రుచిగా ఉండకపోయినప్పటికీ, కుంకుమపువ్వుకి బదులుగా వీటిని వాడుతుంటారు. దుస్తులకి రంగులనిచ్చే అద్దకాలలోనూ వీటిని వినియోగిస్తారు. ఇక బంతిపూలకున్న ఆరోగ్య విశేషాల గురించి చెప్పుకోవాలంటే.... అబ్బో చాలానే ఉననాయి.

 

- బంతిపూల రంగుకి వాటిలో ఉండే కెరోటినాయిడ్స్ అనే రసాయనమే కారణం. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఈ కెరోటినాయిడ్స్ శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తకుండా కాపాడతాయి.

- బంతిపూలు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వందల సంవత్సరాల నుంచీ గ్రీక్, రోమన్, భారతీయ వైద్యాలలో బంతిపూల నూనెకి గొప్ప ప్రాధాన్యతని ఇచ్చారు. బంతిపూల నూనె చర్మానికి మృదుత్వాన్నీ, కాంతినీ అందిచడమే కాదు... అనేక చర్మ సమస్యలకి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దెబ్బతిన్న చర్మం మీద కణజాలం తిరిగి వృద్ధి చెందేందకు, అక్కడ రక్తప్రసరణ మెరుగుపడేందుకు, చర్మంలోని తేమని నిలిపి ఉంచేందుకు బంతిపూల నూనె ఉపయోగపడుతుంది. ఈ కారణంగా చర్మం తెగినప్పుడు, కాలిన గాయాలకి, చర్మవ్యాధులలోను, విష పురుగులు కుట్టినప్పుడు... ఇలా రకరకాల సందర్భాలలో బంతిపూలతో చేసిన నూనె లేదా అయింటెమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది.

 

- బంతిపూల నుంచి తీసిన నూనెకి anti-genotoxic అనే గుణం ఉందని తేలింది. genotoxic అంటే మన డీఎన్ఏలోని జన్యసమాచారం దెబ్బతినడమే! దీని వలన శరీరానికి ఎంతో నష్టం కలుగుతుంది. క్యాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుంది. బంతిపూల నుంచి తీసే ఔషధాలు అలాంటి నష్టాన్ని నివారిస్తాయన్నమాట.

 

- కేవలం బంతిపూలే కాదు. దాని ఆకులూ, గింజలూ, కాడలలో కూడా విశేషమైన ఔషధగుణాలు ఉన్నాయి. అందుకనే వీటిని అనేక ఔషధాలలోనూ, కాస్మెటిక్స్లోనూ వాడుతుంటారు.

 

- బంతిపూల నుంచి తీసే నూనెలో యాంటీవైరస్, యాంటీసెప్టిక్, యాంటీఫంగల్, యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి. అందుకోసం శరీరంలోని అనేక అనారోగ్యాలలో ఇవి అద్భుతమైన ఫలితాలనందిస్తాయి. కండ్ల కలక దగ్గర్నుంచీ మొలల వరకూ వీటిని అనేక సందర్భాలలో వినియోగిస్తారు.

 

- బంతిపూలలో ఇన్ని సుగుణాలు ఉండబట్టి వీటితో టీ కాచుకుని తాగితే మంచిదంటూ ప్రచారం జరుగుతోంది.

 

- బంతిపూల జోలికి క్రిమికీటకాలు రావు కాబట్టి. ఈ చెట్లని పెరట్లో పెంచమని సూచిస్తున్నారు. ఇంట్లో దోమల నుంచి విముక్తి పొందాలంటే హానికారకమైన రసాయనాలని వాడేబదులు బంతి నుంచి తీసిన రసాన్ని వినియోగించమంటున్నారు.

- నిర్జర.