ఎంపీ కోసం దిగొచ్చిన ప్రభుత్వం...ఏకంగా నిబంధనల మార్పు!

 

శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ ఎయిర్ ఇండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన వివాదం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనపై పలు విమానయాన సంస్థలు నిషేదం కూడా విధించాయి. అయితే ఇప్పుడు ఎంపీగారిని విమానం ఎక్కించేందుకు ఏకంగా నింబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్లో ఈ విషయం చర్చకు రాగా పలువురు ఎంపీలు సైతం ఆయనకు మద్దతుగా నిలిచారు. లోక్ సభ స్పీకర్  సుమిత్రా మహాజన్ సైతం ఎంపీపై ఈ తరహా నిబంధనలు కూడదని, మరోసారి ఆలోచించాలని చెప్పడం గమనార్హం. అంతేకాదు దీనిపై ఆమె మంత్రి అశోక్, శివసేన ఎంపీలతో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రవీంద్ర గైక్వాడ్ చేసింది తప్పేనని శివసేన కూడా ఒప్పుకొంది గానీ, విమానాల్లో ఎక్కకుండా నిషేధించడం మరీ తీవ్రమైన నిర్ణయమంది. మరోవైపు శివసేన నేతల ఒత్తిడి కూడా తట్టుకోలేని కేంద్రప్రభుత్వం దిగొచ్చి కొన్ని నిబంధనలను మార్చేందుకు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎంపీని విమానాల్లో ఎక్కించుకునేందుకు వీలుగా సంబంధిత నియమ నిబంధనలను మారుస్తోంది. మొత్తానికి ఉద్యోగిని కొట్టి.. తాను కొట్టానని చెప్పుకున్న ఎంపీ గారిని విమానం ఎక్కించడానికి నేతలందరూ బాగానే కలిసి పోరాడుతున్నారు.