ఎపి సీఎస్ కు ఎంపీ రఘురామ రాజు హెచ్చరికతో కూడిన లేఖ

గత కొంత కాలంగా వైసిపికి కొరకరాని కొయ్యగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వరుసగా రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, వైఫల్యాల పై ప్రశిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయన ఎపి సీఎస్ కు ఒక లేఖ రాసారు. తాజాగా తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల శాఖలోని చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖ‌లో ఆయన కోరారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పోస్టు చేశారని ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా తనపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంపై అయన మండి పడ్డారు. ఆ అభ్యంతరకర పోస్టులపై విచారణ జరిపించి దేవేందర్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని రఘురామరాజు సీఎస్ ను కోరారు. ఒక వేళ ఎటువంటి చర్యలు తీసుకొని పక్షంలో దేవేందర్ రెడ్డికి ప్రభుత్వం, అలాగే ఛీఫ్ సెక్రటరీ కార్యాలయం మద్దతు ఉందని భావించి, ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆ లేఖలో అయన తెలిపారు.

 

ఇప్పటికే ఎపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో కేవలం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారి పైన మాత్రమే చర్యలు చేపడుతూ వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసిపి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాసిన ఈ లేఖ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.