ఆ కేసులనుండి నన్ను కాపాడండి.. హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ 

ఏపీలో వైసీపీ నేతలు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఇరు పక్షాల నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నాయకులు, మంత్రి శ్రీరంగనాథరాజు పోడూరు స్టేషన్‌లో, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. తనను తన తోటి ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని ఎమ్మెల్యే గ్రంధి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయన తమ పార్టీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేశారని గ్రంధి శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు .

అయితే ఈ కేసులకు సంబంధించి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీని కోసం అయన హైకోర్టులో వేరు వేరుగా రెండు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి తన పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లలో అయన న్యాయస్థానాన్ని కోరారు. ఐతే న్యాయస్థానం ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.